https://oktelugu.com/

Ammaodi : అమ్మఒడి’లో రూ.4 వేలు కోత

 గతంలో కూడా చాలా మంది అర్హులకు సాయం అందలేదు. అధికారులు అదిగో ఇదిగో అంటూ చెప్పుకొచ్చారు. గడువుల మీద గడువులు విధించారు. కానీ నగదు మాత్రం అందలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.

Written By:
  • Dharma
  • , Updated On : July 21, 2023 / 01:15 PM IST
    Follow us on

    Ammaodi : గత నెల 28న ఏపీ సీఎం జగన్ అమ్మఒడి పథకానికి బటన్ నొక్కారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేసినట్టు ప్రకటించారు. రోజులు, వారాలు గడుస్తున్నాయి.. కానీ తల్లుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. పిట్ట రెట్టలు పడినట్టుగా..ఎప్పుడు పడుతున్నాయో తెలియడం లేదని సెటైర్లు పడుతున్నాయి. అయితే ఇటీవల నగదు పడుతున్నా రూ.4 వేలు కోత విధిస్తున్నారు. రూ.9 వేలే వేస్తున్నారు. అదేంటి రూ.13 వేలు పడాలి కదా? అంటూ వారంతా బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. బ్యాంక్ సిబ్బందిని అడుగుతుంటే తమకేమీ తేలియదని చెబుతున్నారు. జగనన్నకు అడగండి అంటూ వ్యంగ్యంగా చెబుతుండడంతో వారు నిరాశతో వెనుదిరుగుతున్నారు.

    పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గత నెల 28న వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రుల నడుమ అమ్మఒడి పథకాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. 42.64 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.6,393 కోట్లను జమ చేశారు. అయితే అవి రోజులు గడుస్తున్నా తల్లుల ఖాతాల్లో చేరడం లేదు. ట్విస్టు ఏమిటంటే సీఎం జగన్ ఎక్కడ ప్రారంభించారు. ఆ జిల్లాలో లబ్ధిదారులకే ఇంతవరకూ జమకాలేదు. అయితే ప్రభుత్వం ఈ ప్రక్రియ జూలై 14 వరకూ జరుగుతుందని ముందుగానే ప్రకటించింది. దీంతో లబ్ధిదారులు సైతం పెద్దగా హైరానా పడలేదు. అయితే ఇప్పుడు మూడు వారాలు దాటుతుండడంతో మాత్రం అసలు పడతాయా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

    శ్రీకాకుళం జిల్లా కవిటి, సోంపేట, మందస మండలాల్లో లబ్ధిదారులకు రూ.9 వేల లెక్కనే జమ అవుతుండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులకు, సచివాలయ సిబ్బందిని అడుగుతుంటే వారు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇక నగదు పడని బాధితుల బాధ చెప్పనక్కర్లేదు. అన్నిరకాల పత్రాలు సక్రమంగా అందించినా పథకం వర్తించకపోవడంతో వారి బాధ వర్ణనాతీతం. ఏం చేయ్యాలో తెలియని నిస్సహాయ పరిస్థితి వారిది.

    గతంలో కూడా చాలా మంది అర్హులకు సాయం అందలేదు. అధికారులు అదిగో ఇదిగో అంటూ చెప్పుకొచ్చారు. గడువుల మీద గడువులు విధించారు. కానీ నగదు మాత్రం అందలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే సీఎం జగన్ మాత్రం ప్రతీ తల్లికి సాయమందిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఎంతమందికి పథకం వర్తించింది.. ఎంతమందికి అందలేదు? అన్న స్పష్టత యంత్రాంగంలో లేకపోవడంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిపెట్టాలని లబ్ధిదారులు విన్నవిస్తున్నారు.