AP Survey: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పది రాష్ట్రాల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు నాలుగో విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం(ఏప్రిల్ 18న) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో ఇక నుంచి ప్రీపోల్ సర్వేలు నిలిచిపోనున్నాయి. మరోవైపు ఈనెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 11న ప్రచారం ముగుస్తుంది. 13 ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పలు సంస్థలు సర్వేలు చేశాయి. అవి తాజాగా ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఆంధ్రాలో జనం మూడ్ ఎలా పోల్ పల్స్ సంస్థ సర్వే ఫలితాలు ప్రకటించింది.
సర్వే ఇలా…
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనం మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పోల్ పల్స్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈమేరకు 25 పేజీల రిపోర్టులో రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో ఏయే పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, సీఎంగా జనం ఎవరివైపు మొగ్గుచూపుతున్నారు, పార్టీల వారీగా సాధించే ఓట్ల శాతం ఎలా ఉంది, రాష్ట్రంలో జనాభిప్రాయం వెనుక ఉన్న కారణాలేంటి ఇలా పలు అంశాలపై ఈ సర్వే నిర్వహించింది.
ఫలితాలు ఇలా…
పోల్ పల్స్ ప్రీపోల్ సర్వే ప్రకారం ఈసారి రాష్ట్రం అధికారం చేతులు మారబోతుందని తెలిపింది. టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీయే కూటమికి 98 నుంచి 104 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అధికార వైసీపీకి 54–60 సీట్లు వస్తాయని తేల్చింది. అయితే 23 సీట్లలో మాత్రం గట్టిపోటీ ఉందని తెలిపింది. ఇక జిల్లాల వారీగా కూడా ఫలితాలను వెల్లడించింది. రాష్ట్రంలో ఈసారి కూటమికి 51.2 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీకి 42.8 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. కాంగ్రెస్‌కు కేవలం 3.6 శాతం ఓట్లు, ఇతరులకు 2.4 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.
లోక్‌సభ సీట్లు ఇలా..
ఇక ఏపీలో 25 లోక్ సభ స్థానాలు ఉండగా టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి 18 స్థానాల్లో విజయం సాధిస్తుందని పోల్ పల్స్ అంచనా వేసింది. వైసీపీకి కేవలం 6 స్థానాలే వస్తాయని ప్రకటించింది. విజయనగరం లోక్ సభ సీటులో గట్టిపోటీ ఉందని తెలిపింది. వైసీపీ గెలిచే ఎంపీ సీట్లుగా అరకు, నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి, రాజంపేటగా ప్రకటించింది. మిగిలిన సీట్లలో కూటమి గెలుస్తుందని వెల్లడించింది. ఇందులో బీజేపీ అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం ఎంపీ సీట్లను గెలవనుండగా.. జనసేన పోటీ చేస్తున్న రెండు సీట్లు బందరు, కాకినాడలో గెలుస్తుందని సర్వే సంస్థ తెలిపింది.
పనితీరుపై ఇలా..
ఇక ఈ సర్వేలో పాల్గొన్నవారిలో వైసీపీ ప్రభుత్వం పనితీరు బాగుందని 33 శాతం తెలుపగా, 44 శాతం మంది బాగా లేదని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని 41 శాతం మంది తెలుపగా కూటమి విజయం సాధిస్తుందని 52 శాతం చెప్పారు. ఇక సీఎంగా జగన్‌కు 42.5 శాతం మంది మద్దతు తెలిపారు. చంద్రబాబుకు 50 శాతం మంది మొగ్గు చూపారు.