Chandrababu And Pawan: చంద్రబాబు కూటమి ధర్మాన్ని పాటిస్తున్నారు. జనసేనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కష్టకాలంలో తనకు పవన్ అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తాజా ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడం వెనుక పవన్ కృషి ఉందని భావించి.. ఆయనకు ఎక్కడా ప్రాధాన్యం తగ్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ తో పాటు జనసేనకు చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యం సొంత పార్టీ నేతలకే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు పవన్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని అంశాల్లోనూ పవన్ కు భాగస్వామ్యం కల్పించారు చంద్రబాబు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం తో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. పవన్ ఒక్కరికి డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. క్యాంప్ ఆఫీస్ తో పాటు అధికారిక నివాసాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ప్రత్యేక కాన్వాయ్ ని సైతం పవన్ కోసం ఏర్పాటు చేశారు. పదవుల పంపకాల్లోనూ జగన్ సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నారు. తాజాగా మరో కీలక పదవిని జనసేనకు కట్టబెట్టారు చంద్రబాబు. కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని జనసేనకు కేటాయించారు.
ఏఏజిగా జనసేనకు చెందిన న్యాయవాది ఇవన సాంబశివ ప్రతాప్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్ గా పదేళ్లుగా ప్రతాప్ సేవలందిస్తున్నారు. అటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులు వాదించే ఏఏజి పదవి ఇచ్చి గౌరవించారు. దీంతో జనసేన శ్రేణుల్లో సైతం హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం తిల్లపూడి ప్రతాప్ స్వగ్రామం. ఉమ్మడి ఏపీతోపాటు విభజిత ఏపీ హైకోర్టులో ఆయన సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. హైకోర్టులో దాదాపు 40 ఏళ్లుగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉంది. 1996-2002 మధ్య మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ గా.. ఏపీ మున్సిపాలిటీలకు కూడా సేవలు అందించారు.
ఉమ్మడి హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా కూడా పనిచేశారు ప్రతాప్.2016 నుంచి 2019 మధ్య ప్రభుత్వ వకీలుగా వ్యవహరించారు. ప్రముఖ బ్యాంకులు,ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా ప్రతాప్ వ్యవహరించారు. జనసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి న్యాయపరమైన సేవలు అందిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నారు. జనసేన కు సంబంధించి పార్టీ గుర్తు విషయంలో తలెత్తిన వివాదాలు,రాష్ట్రవ్యాప్తంగా జనసేన కార్యకర్తలపై కేసులు, హైకోర్టులో వాదనలు వినిపించడంలో ముందుండేవారు. అటువంటి వ్యక్తికి సముచిత స్థానం ఇవ్వడం పై జనసైనికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.