Visakhapatnam: ఏపీలో( Andhra Pradesh) ఇప్పుడు విశాఖ కీలకంగా మారింది. పర్యాటకంగా, పారిశ్రామికపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం విశాఖను ఐటి హబ్ గా మార్చాలని చూస్తోంది. ఈ తరుణంలో విశాఖ నగరానికి జనతాకిడి అధికంగా ఉంది. ముఖ్యంగా రైళ్లు రద్దుగా మారాయి. వస్తు రవాణా కూడా పెరిగింది. సహజంగానే ఇది విశాఖ రైల్వే స్టేషన్ పై ఒత్తిడి పెంచుతోంది. రైల్వే స్టేషన్ కు సైతం ఒకే మార్గం ఉంది. విశాఖ వచ్చే రైళ్లు.. మళ్లీ అదే మార్గం గుండా వెళ్లి గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో విశాఖకు అనుబంధంగా ఉన్న సింహాచలం, గోపాలపట్నం, పెందుర్తి రైల్వే స్టేషన్లలో తరచు రైళ్లు నిలిచిపోతుంటాయి. గూడ్స్ రైళ్లు సైతం తరచూ నిలిచిపోతుంటాయి. కేవలం విశాఖ స్టేషన్ కు అనుబంధంగా ఉన్న రైల్వే స్టేషన్లలో అదనపు ప్లాట్ ఫామ్ లు, అదనపు లైన్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిని గుర్తించిన రైల్వే శాఖ విశాఖ జిల్లాలో అదనపు రైల్వే లైన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది.
* ఈ రూట్లలో కొత్త లైన్లు..
విశాఖ జిల్లాలో( Visakha district ) కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. భూ సేకరణ పై కూడా ఫోకస్ పెట్టింది. విశాఖ గోపాలపట్నం రైల్వే స్టేషన్ల మధ్య దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రైల్వేస్టేషన్లో మధ్య మరో రెండు లైన్లు నిర్మించనున్నారు. ఇందుకు రూ.159.47 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త లైన్లు అందుబాటులోకి వస్తే రైళ్ల రద్దీ తగ్గనుంది. అలాగే పెందుర్తి స్టేషన్- ఉత్తర సింహాచలం స్టేషన్ మధ్య దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఈ లైన్ పై వంతెన నిర్మించి.. దానిపై వేరే లైన్ ఏర్పాటు చేయనున్నారు. దువ్వాడ వైపు రైళ్ళను మళ్లించేందుకు అవకాశం కలగనుంది. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.183.65 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే దువ్వాడ స్టేషన్ నుంచి ఉత్తర సింహాచలం మధ్య 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ స్టేషన్ల మధ్య మరో రెండు లైన్లు నిర్మించనున్నారు. ఇందుకు గాను రూ.302 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ లైన్లు అందుబాటులోకి వస్తే రైళ్ల రద్దీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
* మరోవైపు వడ్లపూడి- గేట్ క్యాబిన్ జంక్షన్ రూట్ లో 12.5 కిలోమీటర్ల మేర గంగవరం పోర్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ మీదుగా కొత్తగా మరో రెండు రైల్వే లైన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. దాదాపు రూ.154 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
* ఇంకో వైపు విశాఖ – భువనేశ్వర్ మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సైతం కేంద్ర రైల్వే శాఖ డి పి ఆర్ పూర్తి చేసింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి గూడ్స్ రైళ్ల రాకపోకలకు ప్రత్యేక లైన్ విడిచిపెట్టి.. మిగతా రెండింటిని ప్రజా రవాణాకు వినియోగించుకోవాలని చూస్తోంది. మొత్తానికి అయితే విశాఖ పై కేంద్ర రైల్వే శాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం విశేషం.