Pawan Varahi Yatra : అన్నవరం టు భీమవరం.. ఆ వర్గాలపై పవన్ ఫోకస్

సమాజంలో అన్నివర్గాలతో పవన్ భేటీ కానున్నారు. వారి సమస్యలు తెలుసుకొని ఒక నివేదిక రూపొందించనున్నారు. వాటికి అనుగుణంగా జనసేన మేనిఫేస్టో ఉండనుంది.

Written By: Dharma, Updated On : June 4, 2023 11:46 am
Follow us on

Pawan Varahi Yatra : పవన్ వారాహి యాత్రకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి సత్యదేవుని సన్నిధి నుంచి పవన్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకూ అదిగో ఇదిగో అంటూ వస్తున్న వారాహి యాత్ర పట్టాలెక్కుతుండడంతో జన సైనికుల్లో జోష్ నెలకొంది. పవన్ తన తొలివిడత యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు, కాకినాడ రూరల్‌, అర్బన్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాలను సందర్శించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో సైతం యాత్ర షెడ్యూల్ ఖరారైంది.

జనసేనకు మద్దతుగా కాపులు, బడుగు, బలహీనవర్గాలు ఉన్నారు. ఈ వర్గాల ఓట్లను పదిలం చేసుకునే దిశగా పవన్ చర్యలు ఉండబోతున్నాయి. అదే సమయంలో పవన్ ను కేవలం ఒక సామాజికవర్గానికే పరిమితం చేసే కుట్రను సైతం భగ్నం చేయనున్నారు. పవన్ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ సామాజికవర్గంలో సైతం అదే భావన ఉంది. అయితే 2019 ఎన్నికల్లో ఓటమితో ప్రశ్నించేందుకు కూడా అవకాశం లేకుండా చేశారని పవన్ తనలో ఉన్న బాధను వ్యక్తం చేశారు. దీంతో కాపుల్లో కూడా కసి పెరిగింది. కాపులు ఏకపక్షంగా జనసేనకు మద్దతు తెలిపేందుకు మానసికంగా సిద్ధమయ్యారు.

ఎంత కాదని అనుకున్నా జనసేనకు కాపుల బలం కీలకం. రాష్ట్ర జనాభాలో 27 శాతం కాపులు ఉన్నారన్న గణాంకాల నేపథ్యంలో ఆ వర్గం సపోర్టుగా నిలిస్తే జనసేన బలమైన రాజకీయ శక్తిగా మారే చాన్స్ ఉంది. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల బలం అధికం. అందుకే ఇక్కడ పవన్ వారాహి యాత్ర సక్సెస్ ఫుల్ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు ఓటర్లు ఇతరుల వైపు మళ్లకుండా పవన్ ప్రసంగాలు సాగనున్నాయి. ఈ మేరకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వారాహి యాత్రపై జన సైనికులతో పాటు జనసేనకు అనుబంధంగా పనిచేసే కాపు సంఘాల నాయకులపై స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు సమాచారం.

వారాహి యాత్రలో పవన్ అన్ని వర్గాలతో మమేకం కానున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు యాత్ర ప్రారంభం కానుంది. అంతకంటే ముందే స్థానిక నాయకులతో సమావేశమై నియోజకవర్గ పరిస్థితులపై అధ్యయనం చేస్తారు.  న్యాయవాదులు, మేధావులు, వైద్యులు, ఇతర నిపుణులతో మాట్లాడి వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. రైతులు, మహిళలు, నిరుద్యోగ యువకులు, కళాకారులు, కల్లుగీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు..ఇలా సమాజంలో అన్నివర్గాలతో పవన్ భేటీ కానున్నారు. వారి సమస్యలు తెలుసుకొని ఒక నివేదిక రూపొందించనున్నారు. వాటికి అనుగుణంగా జనసేన మేనిఫేస్టో ఉండనుంది. మొత్తానికైతే వారాహి యాత్ర ద్వారా పవన్ భారీ వ్యూహమే రూపొందిస్తున్నారన్న మాట.