Annadata Sukhibhava: ఏపీ ప్రభుత్వం( AP government ) ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. సంక్షేమ పథకాలను అమలు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల్లో రెండింటిని జూన్ లోనే అందించాలని నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ అందించాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న దృష్ట్యా రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈసారి చిన్నా సన్న కారు రైతులతో పాటు కౌలు రైతులకు సైతం ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చనుంది. ఏడాదికి 20వేల రూపాయలు సాగు సాయం కింద అందించనుంది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ నిధులతో పాటు మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
Also Read: రోహిత్ కెరియర్ అలా ముగియకూడదు.. ఒకవేళ నేను బీజీటీ కోచ్ అయితే: రవి శాస్త్రి!
* కేంద్రంతో కలిపి రూ.20 వేలు
2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పేరిట నగదు సాయాన్ని చేస్తూ వచ్చారు. అధికారంలోకి వస్తే పదిహేను వేల రూపాయల చొప్పున అందిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ కేంద్రం అందించే పీఎం కిసాన్ రూ.6000 తో పాటు మరో రూ.7,500 అందించి చేతులు దులుపుకున్నారు. అయితే తాము అధికారంలోకి వస్తే 20వేల రూపాయల చొప్పున సాగు సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం అందించే 6000 రూపాయలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 14 వేల రూపాయలను అందించనుంది. అయితే ఇది మూడు విడతల్లో అందించేందుకు నిర్ణయించారు. తొలి రెండుసార్లు కేంద్రం అందించే 2000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం 5000 రూపాయలను అందించనుంది. చివరి విడతలో 2000 రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నాలుగువేల రూపాయలను అందించింది. ఇలా మొత్తం మూడు విడతల్లో 20వేల రూపాయల ఆర్థిక సాయం అందనుంది రైతులకు.
* అమలుకు సన్నాహాలు..
వాస్తవానికి కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే వెబ్సైట్లో అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో అతి త్వరలో దీనిని అమలు చేస్తారని అంతా భావించారు. కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదికి ఈ పథకం అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుబంధంగా దీనిని రూపొందించారు. ఈ పథకానికి అర్హతకు సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలు పూర్తయ్యాయి. ఏపీకి చెందిన రైతులు మాత్రమే అర్హులు. ఐదు ఎకరాల్లోపు చిన్న సన్న కారు రైతులు అర్హులు. లబ్ధిదారు వయసు విధిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. భూమికి సంబంధించి పక్కా పత్రాలు, పట్టాదారు పాసుబుక్ తప్పనిసరి. రైతు పేరుతో ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. రైతు పండించే పంటల వివరాలను నమోదు చేయాలి. భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులకు కూడా ఈ పథకానికి అర్హులు. తప్పనిసరిగా కౌలు రైతు ధ్రువీకరణ పత్రం ఉండాలి. పిఎం కిసాన్ పథకానికి అర్హులైన వారంతా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులే.
* కౌలు రైతులకు సైతం..
కేవలం సొంత భూమి కలిగిన వారికే కాకుండా కౌలు తీసుకుని వ్యవసాయం చేసుకున్న వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తించేలా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. అయితే కౌలు రైతు ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదాయ పన్ను చెల్లించిన వారికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. ప్రజా ప్రతినిధులకు సైతం ఈ పథకం వర్తించదు. పదివేల రూపాయల కంటే ఎక్కువ పింఛను పొందే వారికి అన్నదాత సుఖీభవ వర్తించదు. కేవలం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేయనున్నారు.
* అందుబాటులోకి వెబ్సైట్.. https://annadathasukhibhava ప్రత్యేక వెబ్సైట్ ఉంటుంది. అందులో మన స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ బుక్ వంటి భూమి పత్రాలు, బ్యాంక్ పాస్ బుక్, మొబైల్ నెంబర్, భూమి వివరాలు, రైతుల పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు నెంబర్‌ను బ్యాంకు ఖాతాలో అనుసంధానం చేసుకొని ఉండాలి. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పాసుబుక్, బ్యాంక్ పాస్ బుక్ తదితర పత్రాలతో రైతు సేవా కేంద్రంలో అధికారులను సంప్రదించాలి. అక్కడ సిబ్బందికి వివరాలను అందించాలి. అధికారులు రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించి, వివరాలను దృవీకరించుకొని సదరు రైతు పేరును లబ్ధిదారుల జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేస్తారు. రైతు సేవా కేంద్రాల వారిగా నమోదైన వ్యాపిల్యాండ్ దాటాను ఉన్నతాధికారులు పరిశీలించి.. అర్హులైన వారికి అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు.