Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. కానీ చివరి వరకు జగన్ వెంట ఉంటానని ప్రతిసారి చెబుతూ వస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఉన్నట్లు తెలుస్తోంది. అడపాదడపా నెల్లూరు వచ్చి వెళ్తున్నారు. కానీ పార్టీ శ్రేణులను కలవడం లేదు. సీక్రెట్ గా వచ్చి వెళ్ళిపోతున్నారు. అయితే ఆయనకు నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించకపోవడం వల్లే అలా వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేశారు. రాష్ట్రాన్ని ఆరు రీజియన్లుగా విభజించి సమన్వయకర్తలను నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అయితే రీజనల్ కోఆర్డినేటర్ పదవిని ఆశించారు అనిల్ కుమార్ యాదవ్. ఆపై తాను ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కానీ జగన్ నుంచి అటువంటి హామీ దక్కడం లేదు. దీంతో అప్పటినుంచి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఈ తరుణంలో జగన్ ఒక ఆలోచన చేశారు. అనిల్ కుమార్ యాదవ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు.
* పీఏసీలో చోటు
వైసీపీలో అత్యున్నత విభాగం ఒకటి ఉంది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో మాదిరిగా.. వైసీపీకి పిఎసి ఉంది. అందులో చాలామంది సీనియర్లకు చోటిచ్చారు జగన్. ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ను తీసుకున్నారు. అయితే నెల్లూరులో వైసిపి దారుణ పరాజయానికి అనిల్ కుమార్ కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు జిల్లా వైసీపీ నేతలతో విభేదాలు ఉన్నాయి. ఈ తరుణంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
* సొంత పార్టీలో వ్యతిరేకత
2024 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. కీలకమైన ఇరిగేషన్ శాఖను దక్కించుకున్నారు అనిల్. మంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తనకు తిరుగు లేదని భావించిన అనిల్ ప్రత్యర్ధులతో పాటు సొంత పార్టీ వారిని కూడా లెక్క చేయలేదు. కానీ మంత్రివర్గ విస్తరణలో జగన్ ఆయనను తొలగించారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో అనిల్ తీరుతోనే చాలామంది నేతలు పార్టీకి దూరమయ్యారన్న విమర్శ ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పడానికి అనిల్ తీరు కారణమని విమర్శ ఉంది. అటువంటి అనిల్ కు పార్టీలో ఇప్పుడు అత్యున్నత పదవి కట్టబెట్టడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీకి నష్టం చేసిన వ్యక్తికి అందలమెక్కించడంపై ఆగ్రహావేశాలు పార్టీ శ్రేణులనుంచి వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించకుండా.. పీఏసీలో చోటు ఇవ్వడంపై కూడా అనిల్ ఆవేదనతో ఉన్నట్లు సమాచారం.