Anil Kumar Yadav : వైసిపి ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఒకరు.జగన్ పై ఈగ వాలనివ్వని బ్యాచ్ లో నాగబాబు ఒకరు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో సైతం గెలిచారు. నాడు వైసిపి విపక్షంలో ఉన్నా.. గట్టి వాయిస్ వినిపించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో.. అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. భారీ నీటిపారుదల శాఖను అప్పగించారు. నెల్లూరులో అస్మదీయనేతలు ఎంతోమంది ఉన్నా.. అనిల్ కుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపారు. అనిల్ రెడ్డి సామాజిక వర్గాన్ని లెక్కచేయకపోయినా.. ఆయనపై ఫిర్యాదులు వచ్చినా పెద్దగా స్పందించలేదు. ఒకానొక దశలో నెల్లూరు జిల్లాకు తానే సుప్రీం అన్నట్టు వ్యవహరించారు అనిల్. ఆయన తీరుతోనే జిల్లాకు చెందిన చాలామంది సీనియర్లు పార్టీని వీడారు. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు అనిల్ తీరుతోనే తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వైసీపీకి దూరమయ్యారు. అయినా సరే జగన్ అనిల్ కుమార్ యాదవ్ ఎంటర్టైన్ చేశారు. నెల్లూరు అర్బన్ సీటును అనిల్ సూచించిన వ్యక్తికి ఇచ్చి.. నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి అనిల్ ను పంపించారు. అయితే కూటమి ప్రభంజనంలో అందరూ ఓడిపోయారు. అయినా సరే అనిల్ విషయంలో జగన్ వైఖరి మారలేదు. నెల్లూరు జిల్లా నాయకత్వ బాధ్యతలను తిరిగి అనిల్ కే కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
* క్యాడర్ కు దూరంగా
అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన అనిల్ కుమార్ యాదవ్ జాడ ఇప్పుడు నెల్లూరులో కనిపించడం లేదు. నెల్లూరు అర్బన్ నియోజకవర్గం క్యాడర్కు అనిల్ అందుబాటులో లేరట. చెన్నైలో ప్రస్తుతం ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే వైసీపీకి దూరమైనట్టా? లేకుంటే కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నట్టా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఆయన మాత్రం కనిపించకపోవడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. అవసరాలు తీర్చుకొని.. పార్టీ కష్టకాలంలో ఉంటే.. ఇలా చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* ఆయన తీరుతో పార్టీకి నష్టం
అనిల్ కుమార్ యాదవ్ నోటి దూకుడు తనం వల్లే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అయినా సరే జగన్ అనిల్ విషయంలో వెనుకేసుకు రావడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు అనిల్ తాడేపల్లి ప్యాలెస్ లో సైతం పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన వేరే ఆలోచనతో ఏమైనా ఉన్నారా అన్న అనుమానం కూడా ఉంది. అయితే అనిల్ వ్యవహార శైలి తెలిసి.. మిగతా పార్టీలు చేరదీస్తాయి అనుకోలేం. అంతలా ఆయన ప్రవర్తన మితిమీరి పోయింది. ఆయన వ్యవహార శైలి ప్రత్యర్థి పార్టీలకు ప్రయోజనం చేకూర్చింది. సొంత పార్టీకి మాత్రం నష్టం చేకూరింది. అయినా సరే వైసీపీ నాయకత్వం ఆయన ప్రాధాన్యత తగ్గించడం లేదు.