Andhra University : ఆంధ్ర యూనివర్సిటీ( Andhra University) శతాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. నేటి నుంచి ఏడాది పాటు శతాబ్ది వేడుకలు జరగనున్నాయి. 1926 ఏప్రిల్ 26న ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు అయ్యింది. తొలుత బెజవాడలో ఏర్పాటైన యూనివర్సిటీని 1930లో విశాఖపట్నానికి తరలించారు. దేశంలోని పురాతన యూనివర్సిటీలో ఒకటిగా గుర్తింపు సాధించింది ఆంధ్ర యూనివర్సిటీ. సర్ సివి రామన్, సిఆర్ రావు, వెంకయ్య నాయుడు లాంటి పూర్వ విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఈరోజుతో ఆంధ్ర యూనివర్సిటీ వందో సంవత్సరంలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో శనివారం నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 26 వరకు శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
Also Read : శ్రీకాకుళం జిల్లా చంద్రబాబు.. ఎన్నికల హామీకి శ్రీకారం!
* తొలి భాషా ప్రయుక్త విద్యాసంస్థ..
దేశంలోనే తొలి భాషా ప్రయుక్త విద్యాసంస్థ ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలన్న పోరాట ఫలితంగా ఏర్పాటయింది. ఆంధ్రాలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం 1913 నుంచి ఐదేళ్లపాటు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించారు. ఉమ్మడి మద్రాస్( combined Madras state) రాష్ట్రానికి జరిగిన తొలి రెండు ఎన్నికల్లో జస్టిస్ పార్టీ విజయం సాధించింది. అయితే కౌన్సిల్ కు ఎన్నికైన ఆంధ్ర ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న వాదనను బలంగా వినిపించారు. దీంతో 1925 ఆగస్టు 20న బిల్లు ప్రవేశపెట్టారు. 1926 ఏప్రిల్ 26న బెజవాడ కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. తొలి వైస్ ఛాన్సులర్ గా కట్టమంచి రామలింగారెడ్డి, రిజిస్ట్రార్ గా సిడి శెట్టి నియమితులయ్యారు. అయితే బీసీ కట్టమంచి రామలింగారెడ్డి తన జీతంలో సగభాగాన్ని యూనివర్సిటీ అభివృద్ధికి విరాళంగా ఇచ్చేవారు. ఉత్తరాంధ్ర కు చెందిన సంస్థానాధిశులు సైతం అప్పట్లో భారీగా విరాళాలు ప్రకటించారు. అయితే తొలుత బెజవాడలో ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీని ఇతర ప్రాంతాలకు తరలించాలన్న డిమాండ్ వచ్చింది. అలా 1930 సెప్టెంబర్ 5 న విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటయింది.
* తొలుత అద్దె భవనంలో..
తొలుత అద్దె భవనంలో విశాఖలో( Visakhapatnam) ఏర్పాటైన ఆంధ్ర యూనివర్సిటీ దినదిన ప్రవర్దమానంగా ఎదిగింది. రెవెన్యూ శాఖతో పాటు దాతలు సమకూర్చిన సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఏయూ ఏర్పాటయింది. కట్టమంచి రామలింగారెడ్డి తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈజీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తరువాత మళ్ళీ బాధ్యతలు స్వీకరించారు కట్టమంచి రామలింగారెడ్డి. ఏకంగా 13 ఏళ్ల పాటు వీసీగా కొనసాగారు. సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించారు. దేశంలోనే గుర్తింపు కలిగిన యూనివర్సిటీగా ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ను తీర్చిదిద్దారు.
* ప్రపంచ మేధావులే బోధకులుగా..
ఆంధ్ర యూనివర్సిటీ అన్నింటా ప్రత్యేకమే. ప్రపంచంలో గొప్ప మేధావులుగా పేరుపొందిన వారు ఏయూలో పాఠాలు చెప్పారు. హిరెణ్ ముఖర్జీ, సూరి భగవంతం, టీఆర్ శేషాద్రి, హుమయూన్ కబీర్, విఈఆర్వి రావు, మామిడిపూడి వెంకట రంగయ్య, పింగళి లక్ష్మీకాంతం వంటి ఎందరో మహనీయుల బోధనలతో యూనివర్సిటీ గొప్ప విద్యాలయంగా మారింది. నోబెల్ గ్రహీత సర్ సివి రామన్ ఏయూ పూర్వ విద్యార్థి. కొన్నాళ్లు గౌరవ ఆచార్యులుగా పనిచేసి ఇక్కడే పరిశోధనలు చేశారు. పద్మ విభూషణ్ సి ఆర్ రావు కూడా ఏయు పూర్వ విద్యార్థి. ఏయూ పూర్వ విద్యార్థుల్లో ఐదుగురు శాంతి స్వరూప్ భట్నాగర్, ఇద్దరు పద్మ విభూషణ్, ఐదుగురు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, అమెరికాలో ఎఫ్డిఏ డైరెక్టర్ డాక్టర్ ప్రభ ఆత్రేయ, జిఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు వంటి ఎంతో మంది ప్రముఖులు ఏఈలో విద్యను అభ్యసించిన వారే.
* ప్రస్తుతం 20 వేల మంది విద్యార్థులతో..
కేవలం 20 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్థానం.. ప్రస్తుతం 20 వేల మంది విద్యార్థులకు చేరుకుంది. 59 దేశాలకు చెందిన వెయ్యి మంది విదేశీ విద్యార్థులు( foreign students ) ఇక్కడ చదువుకుంటున్నారు. తొలుత తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ విభాగాలు ఉండేవి. ప్రస్తుతం 58 విభాగాలు, 15 ప్రత్యేక పరిశోధన కేంద్రాలు, 76 సమావేశ మందిరాలతో యూనివర్సిటీ ఒక వెలుగు వెలుగుతోంది. 1931లో ఆర్ట్స్ కళాశాల గా ప్రారంభమై.. తరువాత సైన్స్, న్యాయ, ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు అయ్యాయి. యూనివర్సిటీ తరఫున దూరవిద్య సైతం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఆంధ్ర యూనివర్సిటీ కి 18 మంది వైస్ ఛాన్సులర్లు సేవలు అందించారు.
Also Read : ఏపీలో పాకిస్తాన్ కాలనీ.. తాజాగా పేరు మార్చేశారు తెలుసా?