CM Chandrababu : ఏపీ ప్రభుత్వం( AP government) మత్స్యకారులకు రెట్టింపు పరిహారం అందించనుంది. ఈరోజు సీఎం చంద్రబాబు మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లోని బుడగట్లపాలెంలో పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. చేపల వేట నిషేధ సమయానికి గాను.. ప్రతి మత్స్యకారుడు అకౌంట్ లో 20వేల రూపాయల చొప్పున భృతి అందిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు ఈరోజు మత్స్యకారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.258 కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. శ్రీకాకుళం జిల్లా డొంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు ఈ మత్స్యకారుల చేయూత వర్తించనుంది.
Also Read : కడపలో వైసీపీ నేతలతో అదృశ్య శక్తి.. బిజెపి ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు!
* సువిశాల తీరం
సువిశాల సముద్ర తీర ప్రాంతం( sea shore area ) ఏపీ సొంతం. తిరుపతి జిల్లా తడ నుంచి.. శ్రీకాకుళం జిల్లా డోంకూరు వరకు వెయ్యి కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. వేలాది మత్స్యకార గ్రామాలు.. లక్షలాది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అయితే ఎక్కువమంది సంప్రదాయ వేటకు పరిమితం అవుతున్నారు. తీరం వెంబడి జెట్టీలు, ఫిషింగ్ హార్బర్లు లేవు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీ తీరంలో ఆశించిన స్థాయిలో వీటి నిర్మాణం జరగలేదు. దీంతో ఏపీ నుంచి ఎక్కువ మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస పోవడం కనిపిస్తోంది. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ఎటువంటి నిర్మాణాలు నోచుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హార్బర్లతో పాటు జెట్టీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. వాటి నిర్మాణం పై దృష్టి పెట్టింది.
* రెండు నెలల పాటు నిషేధం
సాధారణంగా వేసవిలో( summer ) చేపలు గుడ్లు పెట్టే సమయం. అందుకే ఆ సమయంలో చేపల వేట నిషేధం. ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి.. జూన్ 14 అర్ధరాత్రి వరకు మర పడవలతో వేటను నిషేధిస్తారు. అయితే ఆ సమయంలో మత్స్యకారులకు ఉపాధి ఉండదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో చేపల వేట నిషేధ సమయానికి రేషన్ అందించేవారు. అయితే రేషన్ తో పాటు కొంత భృతి అందించాలని 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ప్రభుత్వం భావించింది. కొంత మొత్తం కేటాయింపులు చేయడం ప్రారంభించింది. 2019 ఎన్నికలకు ముందు వేట నిషేధ భృతిని 5000 రూపాయలకు పెంచింది. అయితే తాము అధికారంలోకి వస్తే రెట్టింపు చేస్తామని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా పదివేల రూపాయల చొప్పున భృతిని అందించారు.
* షెడ్యూల్ ఇదే..
అయితే తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద 20వేల రూపాయల చొప్పున అందిస్తామని చంద్రబాబు ( CM Chandrababu)ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు మత్స్యకారుల ఖాతాల్లో 20000 రూపాయలను జమ చేయనున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ చేరుకోనున్న చంద్రబాబు.. అక్కడ నుంచి హెలిక్యాప్టర్లో 12:10 గంటలకు బుడగట్లపాలెం చేరుకుంటారు. ముందుగా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అనంతరం మత్స్యకారులతో ముచ్చటిస్తారు.1-50 గంటలకు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభకు చేరుకుంటారు. అక్కడ మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గం లోని 500 మంది కూటమి కార్యకర్తలతో సమావేశం అవుతారు. అనంతరం విశాఖ బయలుదేరి వెళ్ళనున్నారు.
Also Read : నిన్న నాగబాబు.. నేడు చిరంజీవి.. చంద్రబాబుపై మారిన ‘మెగా’ అభిప్రాయం!