Andhra Pradesh Teacher Jobs 2025: ఏపీలో( Andhra Pradesh) డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఇప్పటికే డీఎస్సీ ఫలితాలను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు తదుపరి ప్రక్రియ కూడా మొదలైంది. మొత్తం 16,347 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజులపాటు ఆన్లైన్లో అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. తొలుత కీ విడుదల చేశారు. అనంతరం ఫలితాలను ప్రకటించారు. మరోవైపు ఈరోజు మెరిట్ లిస్ట్ ను అధికారులు విడుదల చేయనున్నారు. దీంతో ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియ పై ఒక స్పష్టత రానుంది. ఈ జాబితా జిల్లా వారీగా అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు తమ ర్యాంకును కూడా చూసుకోవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరగనుంది.
Also Read: ఏపీ డీఎస్సీ పై కీలక అప్డేట్!
ఒక్క నోటిఫికేషన్ లేదు
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా రాలేదు. అధికారంలోకి వస్తే ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు 2019 ఎన్నికలకు ముందు. కానీ ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. 2024 ఎన్నికలకు ముందు 6000 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది వైసీపీ సర్కార్. కానీ ఆ ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో రద్దయింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులకు తీవ్ర నిరాశ ఎదురయింది. చంద్రబాబు సైతం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని 2024 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి రావడంతో 16 వేల400 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫలితాలతో పాటు మెరిట్ జాబితాను విడుదల చేస్తున్నారు.
మెరిట్ జాబితా కీలకం
వాస్తవానికి పరీక్ష ఫలితాల కంటే ఈ మెరిట్ జాబితా( merit list) ప్రాతిపదికనే ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మెరిట్ జాబితాతోనే ఎవరెవరికి ఉద్యోగాలు వస్తాయి? ఎవరెవరికి పోస్టింగులు దక్కుతాయి అన్నది స్పష్టత రానుంది. అయితే అధికారులు మాత్రం ఇది తుది జాబితా కాదని.. సర్టిఫికెట్ల పరిశీలన జరిగాక.. మెరిట్ ప్రాతిపదికన తుది జాబితాను ప్రకటిస్తామని చెబుతున్నారు. అయితే ఈరోజు పాఠశాల విద్యాశాఖ మెరిట్ జాబితాను విడుదల చేయనుంది. జిల్లాల వారీగా అధికారిక వెబ్సైట్లో ఉంచనుంది. ఈరోజు సాయంత్రానికి దీనిపై స్పష్టత రానుంది.
Also Read: ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..!
దళారులను నమ్మవద్దు..
మరోవైపు జిల్లా కమిటీలు ( district committees) ఏర్పాటు అవుతున్న క్రమంలో దళారుల బెడద అధికంగా ఉంటుందని ప్రభుత్వం అనుమానిస్తోంది. అందుకే ఎవరైనా ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి, డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. దళారుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని.. అలాంటి వదంతులు సృష్టించే వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా.. అధికారిక వెబ్ సైట్ లో వచ్చే సమాచారం మాత్రమే నమ్మాలని కోరుతున్నారు.