Global Economic Rankings: ప్రపంచంలో ఆర్థికంగా పోటీ పడుతున్న దేశాల జాబితా విడుదలైంది. ఐఎండీ వరల్డ్ కాంపిటేటివ్‌నెస్ ర్యాంకింగ్స్-2025ను ప్రకటించింది. దీని ప్రకారం, భారతదేశం గత సంవత్సరంతో పోలిస్తే రెండు స్థానాలు కోల్పోయి 41వ ర్యాంకులో నిలిచింది. ఆర్థిక పనితీరు, వ్యాపార సామర్థ్యంలో బలమైన స్కోర్ నమోదు చేసినప్పటికీ, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ సామర్థ్యంలో లోటును ఎదుర్కొంటోంది.
Also Read: భూమికి దూరంగా సూర్యుడు.. రేపటి నుంచి జాగ్రత్త.. మునుపెన్నడూ చూడని చల్లని ఉష్ణోగ్రతలు.. హై అలెర్ట్
టాప్ 10 ఆర్థిక వ్యవస్థలు
ఐఎండీ వరల్డ్ కాంపిటీటివ్‌నెస్ ర్యాంకింగ్ ప్రకారం, తూర్పు ఆసియా, పశ్చిమ ఐరోపా దేశాలు టాప్ 10లో 70 శాతం స్థానాలను ఆక్రమించాయి. ఈ ర్యాంకింగ్ ఆర్థిక పనితీరు, ప్రభుత్వ సామర్థ్యం, వ్యాపార సామర్థ్యం, మౌలిక సదుపాయాల ఆధారంగా రూపొందించబడింది. ఈ జాబితాలోని టాప్ 10 దేశాలు ఇలా ఉన్నాయి.
1. స్విట్జర్లాండ్ (100): ఆర్థిక, వ్యాపార, పాలనా కారకాలలో సమతుల్య పనితీరుతో మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది.
2. సింగపూర్ (99.44): 2024లో మొదటి స్థానంలో ఉన్న సింగపూర్ రెండో స్థానానికి జారింది.
3. హాంకాంగ్(99.22): నాలుగు పోటీతత్వ కారకాలలో మెరుగుదలతో రెండు స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకు సాధించింది.
4. డెన్మార్క్ (97.51): బలమైన పాలన, డిజిటల్ అనుకూలతతో నాలుగో స్థానంలో నిలిచింది.
5. యూఏఈ(96.09): ఆర్థిక సంస్కరణలు, వ్యాపార సౌలభ్యంతో ఐదో స్థానం పొందింది.
6. తైవాన్ (93.71): ఆవిష్కరణలు, వ్యాపార సామర్థ్యంతో ఆరో స్థానం.
7. ఐర్లాండ్ (91.31): ఆర్థిక స్థిరత్వం, సామాజిక సమన్వయంతో ఏడో స్థానం.
8. స్వీడన్ (90.2): పర్యావరణ స్థిరత్వం, డిజిటల్ అనుకూలతతో ఎనిమిదో స్థానం.
9. ఖతార్ (89.93): ఆర్థిక వైవిధ్యం, వ్యాపార సామర్థ్యంతో తొమ్మిదో స్థానం.
10. నెదర్లాండ్స్ (89.75): బలమైన మౌలిక సదుపాయాలు, ఆవిష్కరణలతో పదవ స్థానంలో నిలిచింది.
భారతదేశం పనితీరు..
– ఆర్థిక పనితీరు (27వ ర్యాంకు): భారతదేశం ఆర్థిక వృద్ధి, స్థిరత్వంలో బలమైన స్థానాన్ని కలిగి ఉంది, అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఏడు స్థానాలు కోల్పోయింది.
– వ్యాపార సామర్థ్యం (25వ ర్యాంకు): వ్యాపార సౌలభ్యం, ఆవిష్కరణలు, ఉత్పాదకతలో భారతదేశం స్థిరమైన స్థానాన్ని నిలబెట్టుకుంది.
– మౌలిక సదుపాయాలు (51వ ర్యాంకు): రవాణా, ఇంధనం, డిజిటల్ మౌలిక సదుపాయాలలో లోటు భారతదేశం మొత్తం ర్యాంకింగ్‌ను ప్రభావితం చేస్తోంది. అయితే ఈ విభాగంలో రెండు స్థానాల మెరుగుదల కనిపిస్తోంది.
– ప్రభుత్వ సామర్థ్యం (45వ ర్యాంకు): పాలన, విధాన సంస్కరణలు, పరిపాలనా సామర్థ్యంలో ఎదుర్కొంటున్న సవాళ్లు భారతదేశం పోటీతత్వాన్ని దెబ్బతీస్తున్నాయి.
Also Read: కూతురిపై కన్ను.. వ్యాపారమే దన్ను..ట్రంప్ పక్కా కమర్షియల్!
గ్లోబల్ ట్రెండ్స్..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అస్థిరతలతో మార్పులకు లోనవుతోంది. అభివృద్ధి చెందిన దేశాలు సవాళ్లను ఎదుర్కొంటుండగా, నమీబియా, కెన్యా, ఒమన్ వంటి ఉద్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలు సంస్కరణల ద్వారా ర్యాంకింగ్‌లో మెరుగైన స్థానాలను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశం తన ఆర్థిక పనితీరు, వ్యాపార సామర్థ్యంతో పోటీలో ఉన్నప్పటికీ, మౌలిక సదుపాయాలు, పాలనలో సంస్కరణలు అవసరం.