Andhra Pradesh ration cards : ప్రభుత్వం పౌరసరఫరాల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా బిపిఎల్ ( below poverty line) కుటుంబాలకు మాత్రమే రేషన్ పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఆహార భద్రత చట్టానికి లోబడి మాత్రమే లబ్ధిదారులకు రేషన్ సరఫరా చేయాలని నిర్ణయించింది. చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటువంటి వారు ఈ కేవైసీ తో పాటు బయోమెట్రిక్ వేయాలని ఆదేశించింది. అయితే గత కొద్ది నెలలుగా ఈ కేవైసీ గడువు విషయంలో మినహాయింపు ఇచ్చింది కేంద్రం. కానీ ఈసారి మాత్రం ఈ నెల 30లోగా ఈ కేవైసీ పూర్తి చేయని రేషన్ కార్డుదారులకు రేషన్ నిలిపివేయాలని నిర్ణయించింది. ఇదే చివరి అవకాశం గా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
* పెద్ద ఎత్తున బోగస్..
రేషన్ కార్డుల్లో ( ration cards )చాలావరకు నకిలీలు ఉన్నాయన్నది ప్రభుత్వం దృష్టికి వచ్చిన అంశం. అర్హత లేని వారు సైతం రేషన్ కార్డులు తీసుకున్నారని అభియోగాలు ఉన్నాయి. చనిపోయిన వారి పేరిట సైతం రేషన్ కార్డులు కొనసాగుతున్నాయని కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే రేషన్ కార్డుల లబ్ధిదారులకు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవైసీ కి సంబంధించి గడువులు పెంచుకుంటూ వచ్చింది. ఈ నెలలో మాత్రం తప్పకుండా ఈ కేవైసీ చేసుకుంటేనే జూలై నెలకు సంబంధించి రేషన్ అందించేందుకు నిర్ణయించింది.
* అనర్హులకు పెద్దపీట..
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో రేషన్ కార్డులకు సంబంధించి అనర్హులకు పెద్ద ఎత్తున జారీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పైగా గత ఏడాదిన్నరగా ఏపీలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. రకరకాల కారణాలు చూపి రేషన్ కార్డుల పంపిణీ చేయలేదు. అయితే తాము అధికారంలోకి వస్తే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇటీవల రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించారు. అందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. అయితే దీనిని నిరంతర ప్రక్రియ గా కొనసాగించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికే రేషన్ అందించేందుకు నిర్ణయించింది. ఈ కేవైసీ పూర్తి చేయని వారి కార్డులను రద్దు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
* సంక్షేమ పథకాలకు గీటురాయిగా..
సంక్షేమ పథకాలకు( welfare schemes) రేషన్ కార్డు గీటురాయిగా పనిచేస్తుంది. రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న రేషన్ కార్డును అర్హతగా పరిగణిస్తున్నారు. అందుకే గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద ఎత్తున రేషన్ కార్డులు అందినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు అనర్హులను తేల్చి.. వారి స్థానంలో అర్హులకు రేషన్ కార్డులు అందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుత దరఖాస్తులను పరిశీలిస్తే కొత్తగా మూడు లక్షల రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే అంతకంటే ముందే రెండు లక్షల అనర్హుల కార్డులను ఏరివేతకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.