BJP AP Politics: ఏపీ( Andhra Pradesh) రాజకీయం బిజెపి నియంత్రణలో ఉందా? అధికార పార్టీతో పాటు ప్రతిపక్షం కూడా ఆ పార్టీకి దాసోహం అవుతోందా? తెలుగు రాజకీయ పార్టీలతో కాషాయ పార్టీ పొలిటికల్ గేమ్ ఆడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ 2014కు ముందు.. తరువాత అని విభజించుకోవాలి. నరేంద్ర మోడీ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి వైఖరి మారింది. అప్పటివరకు బిజెపికి తెలుగుదేశం పార్టీ బలమైన మిత్రపక్షం. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించడం.. మోదీ స్ట్రాటజీ మార్చడంతో ఏపీ రాజకీయాలు బిజెపి కంట్రోల్ లో చేరిపోయాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
Also Read: ‘బిగ్ బాస్’ అగ్ని పరీక్ష కోసం వచ్చిన 45 మందిలో సెలెక్ట్ అయిన 15 మంది వీళ్ళే
* అప్పట్లో టిడిపి బలమైన మిత్రపక్షం
అటల్ బిహారీ వాజ్పేయి( Atal Bihari Vajpayee), ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడు తదితరులు బిజెపి అగ్ర నేతలుగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ బలమైన మిత్రపక్షంగా కొనసాగేది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం మాత్రమే ఉండేది. అందుకే తెలుగుదేశం పార్టీని బిజెపి చేరదీసింది. బలంగా నమ్మింది కూడా. కానీ కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకొచ్చింది. అప్పటినుంచి బిజెపి స్నేహ వైఖరిలో మార్పు వచ్చింది. జాతీయ రాజకీయ అవసరాలకు తగ్గట్టు ఏపీలో పొలిటికల్ స్ట్రాటజీని అవలంబించింది. దీంతో ఏపీ రాజకీయాలని తన చెప్పు చేతల్లోకి తీసుకుంది.
* అందరూ బిజెపికే మద్దతు
2014లో మోడీ( Prime Minister Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది. 2017లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన రామ్నాథ్ కోవింద్ ఓటు వేశారు. అప్పుడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల కూడా బిజెపి సానుకూలత ప్రదర్శించింది. అనేక అంశాల్లో బిజెపి, వైసిపి ఇచ్చిపుచ్చుకున్నాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకి తెచ్చారు చంద్రబాబు. అది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో చిక్కుకొని ఎన్డీఏ కు దూరమయ్యారు. పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దగ్గరయింది. 2022లో రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. అప్పుడు ప్రతిపక్షంగా తెలుగుదేశం ఉండేది. కానీ బిజెపి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతుగా ఓటు వేసింది. ఇప్పుడు తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. ఎన్డీఏ అడగడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాహటంగానే మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇలా అడిగారో లేదో.. 24 గంటల్లోనే మద్దతు తెలపడం విశేషం.
* ఎన్డీఏకు బలం ఉన్నా..
ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ( Bhartiya Janata Party) నేతృత్వంలోని ఎన్డీఏ కు పార్లమెంట్లో స్పష్టమైన బలం ఉంది. ఎలక్ట్రోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తగిన సంఖ్యాబలం ఎన్డీఏ వద్ద ఉంది. కానీ ఏపీలో అధికార టిడిపి కూటమికి వ్యతిరేకంగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందడం అనేది వ్యూహాత్మకమే. తద్వారా ఏపీ రాజకీయాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నది కేంద్ర పెద్దల లక్ష్యంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన, వైసిపి ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాల బలం అంతంత మాత్రం. అందుకే ఆ మూడు పార్టీలను తన చేతుల్లో ఉంచుకుంటే భవిష్యత్తు అవసరాలు మెరుగుపరుచుకోవచ్చని భావిస్తోంది బిజెపి. మరోవైపు భవిష్యత్తులో బిజెపి అవసరాల దృష్ట్యా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేస్తోంది. అయితే ఏపీ రాజకీయ పార్టీల వ్యవహార శైలిని చూసి.. మిగితా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ముక్కున వేలేసుకుంటున్నాయి. ఇదేం రాజకీయం అంటూ చర్చించుకుంటున్నాయి.