APSBCL : వారంతా చిరుద్యోగులు. జగనన్న ఉద్యోగం కల్పించేసరికి ఉబ్బితబ్బియ్యారు. ఉన్న ఊరిలో రూ.15 వేలు జీతమనేసరికి సంబరపడిపోయారు. 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటానని జగన్ చెప్పేసరికి తమ ఉద్యోగానికి భద్రత లభించిందని భావించారు. కానీ ఇప్పుడు వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. రూ.3 లక్షలు కడతారా? ఉద్యోగం నుంచి తీసేయమంటారా? అనేసరికి ఏంచేయాలో వారికి పాలుపోవడం లేదు. జగనన్న ఎందుకిలా అడ్డం తిరిగారంటూ నిట్టూరుస్తున్నారు. ఇప్పటివరకూ జగన్ తో పాటు ప్రభుత్వంపై చూపుతున్న వినయవిధేయతలను తగ్గించుకుంటున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.
నూతన మద్యం పాలసీతో..
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను ఎత్తివేసి ప్రభుత్వమే నడిపించడానికి సిద్ధమైంది. సేల్స్ మేన్లతో పాటు సూపర్ వైజర్లు, నైట్ వాచ్ మెన్లను నియమించింది. చేసేది మద్యం దుకాణంలో పనైనా.. ఉన్న ఊరిలో రూ.15 వేలు పైచిలుకు జీతం కావడంతో చాలామంది యువకులు పనిలో చేరిపోయారు. మీ వేతనం పెంచుతామని.. ఉద్యోగభద్రత కల్పిస్తామని ఏవేవో భ్రమలు కల్పించారు. దీంతో వారు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాలం గడుస్తున్నా వారికిచ్చిన హామీలు మాత్రం అమలుకాలేదు. కానీ ఇప్పుడు రూ.3 లక్షల పూచీకత్తు ఇవ్వనిదే ఉద్యోగాల్లో ఉండేందుకు వీలులేదని ప్రభుత్వం షరతు పెట్టింది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో రూ.3 లక్షల పూచీకత్తు ఇవ్వాల్సిందేనని ఏపీబీసీఎల్ వారికి నోటీసులిచ్చింది.
15 వేల మందిపై కత్తి..
ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,934 మద్యం షాపులు, మరో 800 వరకూ వాక్ ఇన్ స్టోర్స్ ఉన్నాయి. వీటిలో సుమారు 15 వేల మంది సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లు పని చేస్తున్నారు. గత మూడేళ్లుగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ ను అనుమతించడం లేదు. కేవలం నగదు వ్యవహారాలనే కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో షాపుల లావాదేవీల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ మద్యం షాపుల్లో తరుచూ ఏదో ఒక జిల్లాలో నగదును ఉద్యోగులు స్వాహా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అందుకే ఉద్యోగులకు ఈ నిబంధన పెట్టామని ప్రభుత్వ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.
అసాధ్యమంటున్న చిరుద్యోగులు..
చేసేది మద్యం దుకాణంలో ఉద్యోగం. తమకు ఎవరు ష్యూరిటీ ఇస్తారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు మెలిక పెట్టడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాస్తా పలుకుబడి, పరపతి ఉన్న వారు ఎలాగోలా ఉద్యోగుల ష్యూరిటీ సంపాదిస్తున్నారని.. తమలాంటి వారికి ఎవరు ష్యూరిటీ ఇస్తారని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి తమపై అపనమ్మకం ఉంటే నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. అదే కానీ జరిగితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. అందుకే చిరుద్యోగుల మెడపై కత్తిపెట్టినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.