Andhra Pradesh Legislative Council: ఏపీలో శాసనమండలి చైర్మన్ పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అవిశ్వాసం అనేది అధికార పార్టీ నుంచి కాకుండా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీలు ద్వారా పెట్టాలని సీఎం చంద్రబాబు వ్యూహాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీల రాజీనామాను చైర్మన్ మోసేన్ రాజు ఆమోదించలేదు. దీంతో ఎంత మాత్రం ఆయనను పదవిలో కొనసాగించకూడదని భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అందుకే ఆ ఎమ్మెల్సీలతోనే అవిశ్వాసం పెట్టేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలంటే ఆ పార్టీకి రాజీనామా చేసిన వారితోనే చేయాలన్నది ఒక ఆలోచనగా సమాచారం.
* ఆమోదం పొందని రాజీనామాలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్, జయ మంగళం వెంకటరమణ వంటి వారు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. ఎందుకంటే వీరి రాజీనామాతో వైసిపి బలం తగ్గి కూటమి బలం పెరిగిపోతుంది. అదే జరిగితే శాసనమండలిలో సైతం కూటమి ఆధిపత్యం ప్రదర్శించి తన పదవికి ఇబ్బంది వస్తుందని మండలి చైర్మన్కు తెలుసు. అందుకే ఆ రాజీనామాలను ఆమోదించడం లేదు. అయితే కోర్టు ఇటీవల ఆదేశించింది. వారిని వ్యక్తిగతంగా పిలిచి మరోసారి పరిశీలన చేయాలని సూచించింది. దీంతో ఎమ్మెల్సీ జయ మంగళం వెంకటరమణ వ్యక్తిగతంగా హాజరయ్యారు శాసనమండలి చైర్మన్ ఎదుట. అయితే ఆయన చెప్పిన కారణం సహితం కాదని చెప్పి మరోసారి రాజీనామాను ఆమోదించలేదు. దీంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.
* టిడిపికి ఇబ్బందులే..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్ గా ఉన్నారు. మరోవైపు శాసనమండలిలో వైసీపీకి బలం ఉండడంతో ఆ పార్టీకి ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు చైర్మన్. పైగా మండలి లో టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ క్రమంలో మోసేన్ రాజును చైర్మన్ పదవి నుంచి దించేస్తే మేలన్న నిర్ణయానికి వస్తున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం 2028 వరకు ఉంది. అందుకే ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలతో అవిశ్వాసం పెట్టేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీలు చాలామంది కూటమికి టచ్ లో ఉన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే కచ్చితంగా చైర్మన్ పదవి నుంచి వైదొలగవచ్చు అన్నది ఒక అంచనా. మరి ఏం జరుగుతుందో చూడాలి.