https://oktelugu.com/

CM Jagan:  జగన్ కు గట్టి షాక్.. అసలేంటి జీవోనంబర్ 1.. దీంతో ఏమవుతుంది?

ఈ జీవోను అడ్డం పెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, నారా లోకేష్ లతో పాటు విపక్ష నాయకుల కార్యక్రమాలకు పోలీసులు అడ్డంకులు సృష్టించేవారు.

Written By: , Updated On : May 12, 2023 / 04:01 PM IST
CM Jagan

CM Jagan

Follow us on

CM Jagan:  మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది జగన్ సర్కారు పరిస్థితి. అటు ప్రభుత్వం, ఇటు పార్టీలో జరుగుతున్న పరిణామాలతో సతమతమవుతుండగా హైకోర్టు షాకిచ్చింది. విపక్షాలకు ఊతమిచ్చేలా జగన్ సర్కారు జారీ చేసిన జీవో నంబర్ 1ను కొట్టివేసింది. ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా జీవో ఉందని న్యాయస్థానం తప్పుపట్టింది. రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ అప్పుడెప్పుడో బ్రిటీష్ కాలం నాటి పోలీస్ జీవోను తెరపైకి తెచ్చింది. విపక్షాలే టార్గెట్ గా తెచ్చిన జీవోపై ముప్పేట విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ జీవోను సవాల్ చేస్తూ సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటీషన్ వేశారు. వివిధ పార్టీల నాయకులు సైతం సవాల్ చేశారు. జనవరి 24న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. ప్రతిపక్షాలను కట్టడి చేసేలా జీవో ఉందని.. గొంతు నొక్కేందుకేనని పిటీషనర్ తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు కోర్టు జీవో1ను కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో జగన్ సర్కారుకు చుక్కెదురయ్యింది.

ఆ ఘటనలను సాకుగా చూపి..
కొన్ని నెలల కిందట విపక్ష నేత చంద్రబాబు పర్యటనల్లో అపశృతి దొర్లిన సంగతి తెలిసిందే. కందుకూరు, గుంటూరు పర్యటనల్లో తొక్కిసలాటలో 11 మంది మృత్యువాత పడ్డారు. అయితే ప్రధాన విపక్ష నేత సభలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ఈ ఘటనను సాకుగా చూపుతూ అప్పుడెప్పుడో బ్రిటీష్ కాలం నాటి జీవో1ను తెరపైకి తెచ్చింది. జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్ షోలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. విపక్షనేతల కార్యక్రమాలను అడ్డుకుంది. కానీ ఇందులో వైసీపీకి మినహాయింపు ఇచ్చినట్టు అధికార పార్టీ ర్యాలీలు, రోడ్ షోలు కొనసాగాయి. దీనిపై ముప్పేట విమర్శలు ఎదురయ్యాయి. దీంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. దీంతో హైకోర్టు స్టే విధించింది. జగన్ సర్కారుకు మైండ్ బ్లాక్ అయ్యింది.

సుప్రీం తలుపు తట్టినా..
అయితే తాను పట్టందే పట్టుగా జగన్ సర్కారు వైఖరి ఉంటుందని తెలుసు. దీనిపై ఏకంగా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. అయితే ఇక్కడ జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని.. హైకోర్టులో విచారణ జరుగుతున్నందున అక్కడే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.  దీంతో అప్పటి నుంచి అక్కడ విచారణ జరుగుతోంది. శుక్రవారం తుది విచారణ జరిగింది. వాద ప్రతివాదనలు విన్నతరువాత న్యాయమూర్తులు జీవోను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. అయితే ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి జీవో న్యాయస్థానంలో నిలబడదని న్యాయనిపుణులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో అది నిజమైంది. అటు సుప్రీం కోర్టులో అపీల్ చేసుకునేందుకు కూడా వీలు లేకపోయింది.

విపక్షాల దూకుడు..
ఎన్నికల ఏడాది కావడంతో జీవో1ను కొట్టివేయడంపై విపక్షాలు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీవోను అడ్డం పెట్టుకొని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్, నారా లోకేష్ లతో పాటు విపక్ష నాయకుల కార్యక్రమాలకు పోలీసులు అడ్డంకులు సృష్టించేవారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల నిరసన కార్యక్రమాలకు సైతం ఈ జీవో అడ్డంకిగా నిలిచేది. అయితే కోర్టు జీవోను రద్దుచేయడంతో జగన్ సర్కారుకు ఇది చెంపపెట్టే. ఇదే దూకుడుతో విపక్షాలు, ప్రజాసంఘాలు వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నాయి.