andhra pradesh assembly elections 2024 : టిడిపి కూటమికి సాలిడ్ గెలుపు లభించింది. అటు వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఓటమి తలుపు తట్టింది. ఈ తరహా ఓటమిని వైసిపి అంచనా వేయలేకపోయింది. అదే స్థాయిలో భారీ స్థాయిలో గెలుపును ఊహించలేకపోయింది టిడిపి కూటమి. అయితే ఒకరిది ఓవర్ కాన్ఫిడెన్స్. మరొకరిది సమిష్టి విజయం. కూటమి ప్రతి అడుగు పక్కాగా వేయగా.. వైసీపీని మాత్రం అతి ధీమా కొంపముంచింది. కోలుకోలేని దెబ్బతీసింది. కనీవిని ఎరుగని ఓటమి ఎదురైంది. అయితే ఇది వైసీపీ స్వయంకృతాపమే.
ప్రజల్లో నివురు గప్పిన అసంతృప్తిని పసిగట్టడంలో వైసిపి విఫలం అయ్యింది. పెద్ద ఎత్తున ఓటింగ్ పెరగడం కూడా వైసీపీకి మైనస్ గా మారింది. కానీ అదంతా తమ పాజిటివ్ ఓటు బ్యాంకు అని వైసిపి నమ్మింది. సంక్షేమ పథకాలు అందుతుండడంతో ప్రజల్లో సంతృప్తి శాతం ఉంటుందని వైసీపీ భావించింది. కానీ ప్రజల్లో ఉన్న అసంతృప్తి జ్వాలలను తెలుసుకోలేక పోయింది. అభివృద్ధి విషయంలో అస్సలు పట్టించుకోలేదు. ముందుగా సంక్షేమం అన్నట్టు వ్యవహరించింది. కొత్త పరిశ్రమల రాక, ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించకపోవడం, చాలా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం కూడా మైనస్ గా మారింది. ఒక్క సంక్షేమ పథకాలు ఆదుకుంటాయన్న ఆలోచన సైతం ఫెయిల్ అయ్యింది.
ఇక తెలుగుదేశం పార్టీకి అన్ని శకునాలుగా పని చేశాయి. అన్ని అంశాలు కలిసి వచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటుతో పరిస్థితి మారిపోయింది. మూడు పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరింది. అన్నింటికీ మించి బిజెపిని ఒప్పించడం కలిసి వచ్చింది. అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీ కూటమికి అండగా నిలిచింది. చిరంజీవితో ప్రత్యేక ప్రకటన, సినీ పరిశ్రమ నుంచి మద్దతు కలిసి వచ్చాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకోని వరంగా మారింది. ఆస్తులకు సంబంధించి ధ్రువపత్రాలపై జగన్ ఫోటోను ఎక్కువమంది వ్యతిరేకించారు. అది భూములు లాక్కునేందుకు చేసిన యాక్ట్ అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. అంతకుముందే చంద్రబాబు అరెస్టుతో ఒక రకమైన సానుభూతి ప్రజల నుంచి వ్యక్తమైంది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు అరెస్టు చేశారని, ఏడుపదుల వయసులో ఆయనకు సుదీర్ఘకాలం జైలులో పెట్టడం, అందుకు సహేతుకమైన కారణాలు చూపకపోవడం కూడా మైనస్ గా మారింది. కూటమికి ప్లస్ గా మారాయి.