Andhra Cabinet Politics: ఆ ఇద్దరు మంత్రులు చంద్రబాబు( CM Chandrababu) అంచనాలకు అందుకోవడం లేదా? టిడిపి శ్రేణులతో మమేకమై పనిచేయడం లేదా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయలేకపోతున్నారా? చంద్రబాబులో అసహనానికి అదే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అయితే ఇప్పుడు కొందరు మంత్రుల పనితీరుపై చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణలో కొందరికి ఉద్వాసన తప్పదని సంకేతాలు వస్తున్నాయి. అయితే ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరిన ఆ ఇద్దరు మంత్రుల వ్యవహార శైలి పైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఆనం వారి అసంతృప్తి..
ఏపీ క్యాబినెట్లో( AP cabinet) అత్యంత సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి. ఆర్థిక శాఖ లాంటి పెద్ద పదవులు నిర్వర్తించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు ఎనలేని ప్రాధాన్యత దక్కింది. నెల్లూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనను రెండుసార్లు క్యాబినెట్లోకి తీసుకున్నారు రాజశేఖరరెడ్డి. అటు తరువాత వచ్చిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో సైతం కీలక మంత్రిత్వ శాఖ దక్కింది. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఆనం రామనారాయణరెడ్డిని( ramanarayana Reddy ) జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. అందుకే ముందుగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. తన సీనియారిటీకి తగ్గ గౌరవం ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో టిడిపిలో చేరారు. టిడిపి తరఫున గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డికి క్యాబినెట్లోకి తీసుకున్నారు చంద్రబాబు. కానీ అప్రాధాన్య శాఖగా భావించే దేవాదాయ శాఖను అప్పగించారు. అప్పటినుంచి అసంతృప్తి గానే ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి.
Also Read: ఏపీలో ఏడుగురు మంత్రులపై వేటు!
పార్థసారథి మార్పు..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి టిడిపిలో చేరిన కొలుసు పార్థసారధికి( kolusu parthasarathi ) మంచి ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. కాంగ్రెస్ పార్టీలో ఉండే సమయంలో పార్థసారథి మంత్రిగా వ్యవహరించారు. మృదు స్వభావి ఆపై మంచి నేతగా గుర్తింపు పొందిన పార్థసారధికి పౌర సంబంధాలతో పాటు గృహ నిర్మాణ శాఖ బాధ్యతలను ఇచ్చారు చంద్రబాబు. అయితే ఆయనలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాసనలు పోలేదన్న విమర్శ ఉంది. పైగా వైసిపి పై విమర్శలు చేయడంలో వెనుక పడ్డారన్న అపవాదు కూడా ఉంది. ప్రధానమైన కృష్ణాజిల్లాలో ఆయన మంత్రిగా ఉండడం పై ఫిర్యాదులు వస్తున్నాయి. మొన్న ఆ మధ్యన జోగి రమేష్ తో వేదిక పంచుకున్నారన్న విమర్శ కూడా ఉంది. స్థానిక ఎమ్మెల్యేలతో అంతగా సఖ్యత లేదని కూడా తెలుస్తోంది.
మంత్రులుగా కొనసాగిస్తూనే..
అయితే ఈ ఇద్దరు మంత్రుల విషయంలో చంద్రబాబు ఒక ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవులు కొనసాగిస్తూనే.. మంత్రిత్వ శాఖలను మార్చుతారని ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అయితే ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నేత కావడంతో ఇదే చివరి అవకాశం గా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్థసారథి సైతం హాని చేసే నేత కాదు. నమ్మకంగా టిడిపిలో చేరారు. అందుకే ఆయన విషయంలో సైతం చంద్రబాబు పునరాలోచన చేసే అవకాశం ఉంది.