TDP minister removal list: ఏపీలో( Andhra Pradesh) ఐదుగురు మంత్రులు ప్రమాదంలో ఉన్నారా? వారి తొలగింపు ఖాయమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టిడిపికి సానుకూల ఫలితాలు ఇచ్చే ఓ సర్వే చేసే వ్యక్తి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలు 40 మంది పై తీవ్ర వ్యతిరేకత ఉందని.. మంత్రులు సైతం రెడ్ జోన్ లో ఉన్నట్లు ఆ సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో ఇటీవల జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు సైతం కొందరు మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. మారకపోతే తానే మార్చేస్తానని.. క్యాబినెట్ లోకి వచ్చేందుకు కొత్త మంత్రులు సిద్ధంగా ఉన్నారని కూడా హెచ్చరికలు జారీ చేసినట్లు టాక్ నడిచింది. ఈ తరుణంలో ఓ సర్వే సంస్థకు చెందిన ప్రతినిధి సంచలన విషయాలు బయట పెట్టినట్లు సమాచారం. ఓ ఏడుగురు మంత్రులపై వేటు తప్పదని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సర్వే సంస్థ హెచ్చరికతో ..
2024 ఎన్నికలకు ముందు టిడిపికి( Telugu Desam Party) అనుకూలంగా ఈ సర్వే ఫలితాలు ఇచ్చేవారు. ఆయన ఇచ్చిన సర్వేకు తగినట్టు ఏపీలో ఫలితాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు సదరు వ్యక్తి చెప్పిన మాదిరిగా ఏడుగురు మంత్రులపై వేటు తప్పదని ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం క్యాబినెట్లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. దానిని జనసేన ఎమ్మెల్సీ నాగబాబుతో భర్తీ చేస్తారని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కొత్తగా ఏడుగురు మంత్రులపై వేటు వేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: ఏపీలో ప్రమాదంలో ‘పొత్తు’.. ముందే మేల్కొంటున్న పవన్ కళ్యాణ్!
ఆ పదిమంది కొత్త వారే..
ప్రస్తుతం క్యాబినెట్ లో( cabinet ) ఉన్న పదిమంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే. వివిధ సమీకరణల దృష్ట్యా సీనియర్లను పక్కన పెట్టి.. జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. కానీ చంద్రబాబు అంచనాలకు తగ్గట్టు వారు పనిచేయడం లేదు. దీంతో ఎప్పటికప్పుడు చంద్రబాబు హెచ్చరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సర్వేలలో చాలామంది మంత్రులు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తేలింది. అందుకే చంద్రబాబు స్వయంగా హెచ్చరించారని.. ప్రత్యామ్నాయంగా నేతలను సిద్ధం చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది సీనియర్ నేతలు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. అయితే వివిధ సమీకరణల దృష్ట్యా వారికి అవకాశం దక్కలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అప్పుడే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు సిద్ధపడతారా అన్నది ఒక అనుమానమే. అయితే టిడిపికి అనుకూలంగా సర్వే ఫలితాలు ఇచ్చే వ్యక్తి.. ఏడుగురు మంత్రులను మారుస్తారని సంకేతాలు ఇవ్వడం మాత్రం సంచలన అంశంగా మారింది.