Sugali Preethi Case: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందట సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేశారు. దీనిపై పవన్ కూడా స్పందించారు. అన్ని విధాల అండగా ఉన్నందుకే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం. వాస్తవానికి వైసీపీ హయాంలోనే సిబిఐకి ఈ కేసు అప్పగించారు. విచారణ సవ్యంగా జరగలేదని భావించి మరోసారి ఇప్పుడు సిబిఐ కు ఈ కేసును అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనున్నట్లు సమాచారం.
* గతంలో సిబిఐ కి..
2017 ఆగస్టు 18న సుగాలి ప్రీతిమృతదేహం కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో కనిపించింది. సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ సుగాలి ప్రీతి మృతదేహం కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది. అటు తరువాత బాధితురాలి కుటుంబ సభ్యుల పోరాటంతో నిందితులుగా భావిస్తున్న పాఠశాల యాజమాన్యం, యజమాని కుమారులు అరెస్ట్ అయ్యారు. 23 రోజుల్లోనే బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే సుగాలి అఘాయిత్యానికి గురైందని పోస్టుమార్టం నివేదికలో తేలింది. వైసిపి హయాంలో ఈ కేసును సీబీఐ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. దాదాపు ఈ కేసు కనుమరుగు అయిందన్న పరిస్థితుల్లో జనసేన అధినేతగా ఉన్న పవన్ పోరాటం చేయడం ప్రారంభించారు. సుగాలి ప్రీతి కేసును వెలుగులోకి తీసుకురావడంలో పవన్ పాత్ర కూడా ఉంది. అప్పట్లో పవన్ చేసిన పోరాటంతోనే వైసీపీ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా నిలిచింది. వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలం కేటాయించింది. సుగాలి తండ్రికి ఔట్సోర్సింగ్ విధానంలో రెవెన్యూ శాఖలో ఉద్యోగం కూడా ఇచ్చింది.
* ఇటీవల పరిణామాల నేపథ్యంలో..
అయితే ఇటీవల మీడియా ముందుకు వచ్చి సుగాలి తల్లి పార్వతి దేవి సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో తమకు అండగా నిలిచి.. పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదంటూ సుగాలి ప్రీతి తల్లి ఆరోపించారు. పట్టించుకోకుంటే జనసేన రాష్ట్ర కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. అయితే ఆమె కామెంట్లపై ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.