Visakhapatnam: ఇడియట్ సినిమా గుర్తుంది కదూ.. అందులో ఆలీ తరచూ పోలీసులు చిక్కుతుంటాడు. బీదర్ నుంచి ఇసుక తీసుకొస్తున్నానంటూ చెబుతూ నమ్మబలికి తప్పించుకుంటాడు. అయితే ఇసుకను సాకుగా చూపి తరచూ బైకులు దొంగతనం చేసి.. పోలీసుల కళ్ళు కప్పి తరలిస్తుంటాడు. అటువంటిదే సేమ్ సీన్ విశాఖలో వెలుగు చూసింది. ఏకంగా వాషింగ్ మిషన్లు మాటున కోట్లాది రూపాయలు తరలించకపోవడాన్ని పోలీసులు గుర్తించారు.
సాధారణంగా దసరా అంటేనే గృహూపకరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. వాటి క్రయవిక్రయాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆటో పై ఓ ఆరు వాషింగ్ మిషన్లు తరలిస్తున్నారు. అయితే అవి అనుమానాస్పదంగా కనిపిస్తుండడంతో పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమాచారం అందింది. సరిగ్గా విశాఖ ఎన్ఏడి ప్రాంతానికి వెళ్లేసరికి క్రైమ్ పోలీసులు చుట్టుముట్టారు. ఆటో ను తనిఖీలు చేశారు. కానీ ఎటువంటి నగదు గానీ. అనుమానాస్పద వస్తువులుగానీ పట్టుబడలేదు.దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఇడియట్ సినిమాలో జీవ మాదిరిగా సంథింగ్ ఇజ్ రాంగ్ అంటూ విశాఖ పోలీసులు అనుమానం పడ్డారు. ఎందుకైనా మంచిదని ఆటోను క్షుణ్ణంగా పరిశీలించారు. వాషింగ్ మిషన్లను ఒకటికి రెండుసార్లు చూశారు. వాటి సీళ్లను తొలగించి వాషింగ్ మిషన్ల లోపల చూసేసరికి వారి కళ్ళు బైర్లు కమ్మాయి. నోట్ల కట్టలు బయటపడ్డాయి.అయితే ఈ ఆటో వెంబడి బైక్ పై ఓ వ్యక్తి అనుసరించడాన్ని పోలీసులు గుర్తించారు. ఆటోలో కోటి 13 లక్షల రూపాయలు బయటపడ్డాయి. అయితే ఎక్కడికి తరలిస్తున్నారని ఆటో డ్రైవర్ని అడిగితే విజయవాడ అని సమాధానం చెప్పాడు.
అయితే ఆటోపై విజయవాడ తీసుకెళ్లడం సాధ్యమా? దాదాపు 500 కిలోమీటర్లు ఎలా తీసుకెళ్తారు? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ నేపథ్యంలో ఓ షాపు యజమాని వచ్చి ఆ నగదు తమదేనని.. విజయవాడలో బ్యాంకు లో జమ చేసేందుకు తీసుకెళుతున్నట్లు చెప్పాడు. అయితే ఆయన మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పోలీసులు నగదు తో పాటు వాషింగ్ మిషన్లను, ఆటోను సీజ్ చేశారు.