https://oktelugu.com/

Ambati Rayudu: చివరికి పవన్ చెంతకు అంబటి రాయుడు

క్రికెట్ కెరీర్ లో కొనసాగుతుండగానే అంబటి రాయుడు.. పొలిటికల్ ఆసక్తి బయటపడింది. ఏపీ సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచేత్తడం ద్వారా ఆయన వైసీపీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు వచ్చాయి.

Written By:
  • Dharma
  • , Updated On : April 11, 2024 / 10:07 AM IST

    Ambati Rayudu

    Follow us on

    Ambati Rayudu: మొన్న ఆ మధ్యన క్రికెటర్ అంబటి రాయుడు ఒక ట్విట్ చేశారు. ‘సిద్ధం’ అంటూ పోస్ట్ చేయడంతో రాయుడు యూటర్న్ తీసుకున్నారా? అన్న అనుమానం కలిగింది. కొద్దిరోజుల కిందట వైసీపీలో చేరి.. ఆ పార్టీకి రాయుడు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అటు తర్వాత పవన్ ను కలిశారు. దీంతో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. సిద్ధం పేరిట ట్విట్ చేయడంతో మళ్లీ రాయుడు వైసీపీలో చేరతారా అన్న ట్విస్ట్ నడిచింది. కానీ ఇప్పుడు జనసేన ఎన్నికల ప్రచార స్టార్ క్యాంపైనర్ల జాబితాలో అంబటి రాయుడు పేరు ఉండడంతో.. వైసీపీలో చేరతారు అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. జనసేనతో రాయుడు కలిసి ప్రయాణం చేస్తారని స్పష్టత వచ్చింది.

    క్రికెట్ కెరీర్ లో కొనసాగుతుండగానే అంబటి రాయుడు.. పొలిటికల్ ఆసక్తి బయటపడింది. ఏపీ సీఎం జగన్ ను పొగడ్తలతో ముంచేత్తడం ద్వారా ఆయన వైసీపీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు వచ్చాయి. అటు తర్వాత క్రికెట్ కొద్దిసేపు విరామం ఇచ్చి అంబటి రాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. తనకు అనువైన నియోజకవర్గం ఏదా అని ఆరా తీశారు. చివరకు గుంటూరు పార్లమెంట్ స్థానానికి ఫిక్స్ అయ్యారు. ఆ సీటు అంబటి రాయుడుదేనని వైసీపీ నేతలు సైతం లీకులిచ్చారు. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరారు. కానీ గుంటూరు పార్లమెంట్ స్థానం విషయంలో జగన్ వేరే ఆలోచన చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు అంబటి రాయుడు. పార్టీలో చేరిన పది రోజులు కాకమునుపే.. వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. క్రికెట్ కెరీర్ కొనసాగించడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ అక్కడకు ఒక రోజు వ్యవధి లోనే ట్విస్ట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వద్ద ప్రత్యక్షమయ్యారు. అంతా జనసేనలో రాయుడు చేరతారని భావించారు. కానీ కేవలం సమావేశానికి పరిమితమయ్యారు.

    గత కొద్దిరోజులుగా అంబటి రాయుడు సైలెంట్ గా ఉన్నారు. కానీ జగన్ రాష్ట్రవ్యాప్తంగా మేము సిద్ధం పేరిట బస్సు యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి జగన్ బస్సు యాత్రకు సిద్ధపడుతుండగా.. అంబటి రాయుడు తాను సైతం సిద్ధం అంటూ ట్విట్ చేశారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాయుడు వైసీపీలో రీఎంట్రీ ఇస్తారని ప్రచారం ప్రారంభమైంది. కానీ అంబటి రాయుడు ఇంతవరకు స్పందించలేదు. అయితే జనసేన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో అనూహ్యంగా అంబటి రాయుడుకు చోటు దక్కింది. జనసేన అధినేత పవన్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, కమెడియన్ 30 ఇండస్ట్రీ పృథ్వి, మొగలిరేకులు సీరియల్ ఫేమ్ సాగర్, జబర్దస్త్ ఆర్టిస్టులు హైపర్ ఆది, గెటప్ శీను, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటు అంబటి రాయుడు పేర్లను జనసేన హై కమాండ్ ఖరారు చేశాయి. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను వెల్లడించాయి. దీంతో అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచారు. రాయుడు అటు తిరిగి ఇటు తిరిగి చివరకు పవన్ గూటికి చేరినట్లు అయ్యింది.