Ambati Rambabu: ఏపీలో మరో మంత్రి సీటును జగన్ చించేశారు. ఇప్పటికే గుడివాడ అమర్నాథ్ ను గాలిలో పెట్టారు. గుమ్మనూరు జయరామ్ ను పొమ్మన లేక పొగ పెట్టారు. ఇప్పుడు ఆ వంతు అంబటి రాంబాబుకు వచ్చింది. ఈసారి ఆయనకు సత్తెనపల్లి టిక్కెట్ లేదని తెలుస్తోంది. ఆయన తప్పించి సోదరుడు అంబటి మురళికి జగన్ టికెట్ కేటాయించారు. పొన్నూరు అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో అంబటి రాంబాబు పై వేటు వేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ చర్యలతో అంబటి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
వైసీపీలో అంబటి మురళి కొనసాగుతున్నారు. కానీ ఆశావహుడు మాత్రం కాదు. అయినా సరే ఆయనకు పొన్నూరు టికెట్ ను జగన్ కట్టబెట్టారు. ఈ లెక్కన అన్నదమ్ముడు అంబటి రాంబాబుకు రెక్కలు తీసేసినట్టే కదా. ఈసారి సత్తెనపల్లిలో అంబటి రాంబాబు వెనుకబడినట్లు జగన్ గుర్తించారు. పైగా అక్కడ రాంబాబు వ్యతిరేక వర్గం స్ట్రాంగ్ గా ఉంది. ఈసారి పోటీ చేసిన ఓటమి ఖాయమని తేలుతోంది. అందుకే ఈసారి అక్కడ అభ్యర్థిని మార్చితే గాని పరిస్థితి అదుపులోకి రాదని జగన్ భావించారు. అందుకే అక్కడ అనూహ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఖరారు చేసినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ హామీ తోనే ఆయన వైసీపీలో తిరిగి చేరారని చెబుతున్నారు. మంగళగిరిలో బీసీ అభ్యర్థికి సపోర్ట్ చేసి.. సత్తెనపల్లి లేదా గుంటూరు పార్లమెంట్ స్థానం తీసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తనకు సత్తెనపల్లి కావాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో అంబటి సోదరుడు మురళిని పొన్నూరుకు పంపించి.. ఇక్కడ రామకృష్ణారెడ్డికి ఖరారు చేశారు.
అయితే సత్తెనపల్లి టిక్కెట్ తనదేనని అంబటి రాంబాబు భావిస్తున్నారు. అప్పుడే ప్రచారం సైతం మొదలుపెట్టారు. విన్యాసాలు సైతం ప్రారంభించారు. టీ పెట్టడం, నలుగురితో టీ తాగడం, దోసెలు వేయడం వంటి వాటితో బిజీబిజీగా ఉన్నారు. కానీ జగన్ స్కెచ్ మరోలా ఉంది. తమ్ముడిని లైన్ లో పెట్టి అన్నను భలేగా పక్కతోవ పట్టించారు. ఇప్పుడు అంబటి పరిస్థితి కక్కలేరు మింగలేరు. పార్టీ విశాల ప్రయోజనాలు అన్న మాట తప్ప మరొకటి కనిపించడం లేదు. అధినేత నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అన్న మాటే ఇప్పుడు అంబటి నోట వినిపిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అంతకుమించి ఆప్షన్ అంబటికి లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.