Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిపై కదలిక వచ్చింది. ఇలా ఫలితాలు వచ్చాయో లేదో అమరావతి పురవీధుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. వందలాది జెసిబిలతో ముళ్ళ పొదలను తొలగించారు. వాహనాల్లో తరలించారు. శాశ్వత జంగిల్ క్లియరెన్స్ పనులకు దాదాపు 33 కోట్ల రూపాయలతో ప్రభుత్వం టెండర్లకు పిలిచింది. మరోవైపు అమరావతి నిర్మాణాల స్థితిగతులను ఇప్పటికే సి ఆర్ డి ఏ అధికారులు పరిశీలించారు. ఒక నివేదికను తయారు చేశారు. అమరావతి నిర్మాణాలను యధాస్థితిలోకి తీసుకురానున్నారు. మరోవైపు మద్రాస్ ఐఐటి, హైదరాబాద్ ఐఐటి నిపుణులు అమరావతిలోని ఐకానిక్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఐదేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న పనులను అర్ధాంతరంగా వైసీపీ సర్కార్ నిలిపివేసింది. ఈ క్రమంలో ఈ నిర్మాణాలు చేయవచ్చా? లేకుంటే అదనపు నిర్మాణాలు చేయాలా? అన్న విషయాలను ఐఐటీ ని పుణులు అధ్యయనం చేశారు. ఈ క్రమంలో వైసిపి సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించింది. టిడిపికి అనుకూల మీడియా గా ఉండే టీవీ5, ఆంధ్రజ్యోతి ప్రసారాలను హైలెట్ చేస్తూ.. అమరావతి రాజధాని ఇంకా నీటిలోనే ఉందని చెబుతూ చేస్తున్న ప్రచారం వైరల్ అవుతోంది. మీరు మారాలి బాబు అంటూ చేస్తున్న ఈ ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. నెటిజెన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. ఈరోజు ఐఐటీ నిపుణుల పర్యటన ఒకవైపు, సిఆర్డిఏ సమీక్ష మరోవైపు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ అనుకూల మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురిస్తోంది. అవే కథనాలతో వైసిపి ప్రచారం చేస్తుండడం విశేషం.
* జంగిల్ క్లియరెన్స్ పై అదే ప్రచారం
ప్రాథమికంగా అమరావతి రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ఇంకా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా జరిగింది. 45 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ తో పాటు వివిధ నిర్మాణాల వద్ద నిలిచిపోయిన నీటిని తోడించనున్నారు. బయట ప్రాంతానికి పంపించమన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం 33 కోట్ల రూపాయలను కేటాయించింది. కేవలం జంగిల్ క్లియరెన్స్ కే అంత నిధులా?అంటూ అప్పట్లో వైసీపీ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసింది. పోస్టులువైరల్ చేసింది.
* ఇంకా నీటిలోనే నిర్మాణాలు
వాస్తవానికి ఐకానిక్ నిర్మాణాలు, సచివాలయ శాశ్వత నిర్మాణం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలు ఇంకా నీటిలోనే ఉండిపోయాయి. గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంగా విడిచి పెట్టడంతో.. అమరావతి రాజధాని ప్రాంతం చిట్టడవిలా మారిపోయింది. ఎటు చూసినా పిచ్చి మొక్కలు, అడుగులలోతులో నీరు నిలిచిపోయింది. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనులను యధాస్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
* కేంద్ర సాయం పై అనుమానాలు
అమరావతి రాజధాని నిర్మాణానికికేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై సైతం వైసీపీ సోషల్ మీడియా అడ్డగోలుగా ప్రచారం చేసింది. అసలు అవి అప్పుగా ఇస్తున్నవా? గ్రాంట్ గా ఇస్తున్నవా? అంటూ ప్రచారం మొదలు పెట్టింది. వైసిపి అనుకూల మీడియా సైతం రెచ్చిపోయింది. మరోవైపు ఈరోజు రెండు రాష్ట్రాలకు చెందిన ఐఐటి నిపుణులు అధ్యయనం చేసేందుకు వచ్చారు. ఈ తరుణంలో అమరావతిలో ఏమున్నదని చూస్తారు.. చంద్రబాబు ఇకనైనా మారండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేసింది వైసిపి. దీనిపై టిడిపి కూటమి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత ఐదేళ్లుగా అమరావతిని నిర్వీర్యం చేసిన మీరా మాట్లాడేది అంటూ విరుచుకుపడుతున్నాయి.