Amaravati : అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రపంచంలోనే తలమానికంగా అమరావతి నవ నగరాలు నిర్మించాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. అందులో భాగంగా విజయవాడ తాడిగడపలో భారీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి నిర్ణయించింది. 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ టవర్ కు ఈ వారమే శ్రీకారం చుట్టబోతోంది. ప్రభాస్ ఆంధ్రుల సహకారంతో apnrt సొసైటీ ద్వారా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు అమరావతి పునర్నిర్మాణానికి కొత్త ఉత్సాహం తీసుకురానుంది. ఈ నెల రెండున ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే మూడేళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగా శరవేగంగా అడుగులు వేస్తోంది.
Also Read : మూడేళ్లలో అమరావతి.. ఆ పనులు చేస్తేనే సాధ్యం!
* బహుళ అంతస్తుల్లో నిర్మాణం..
తాజాగా చేపట్టనున్న ఈ టవర్( Tower ) నిర్మాణం ప్రత్యేక గుర్తింపు తీసుకు వస్తుందని భావిస్తున్నారు. 36 అంతస్తుల్లో ఈ టవర్ నిర్మాణం జరగనుంది. ఒక టవర్ ను నివాసాల కోసం, మరొకదాన్ని కార్యాలయాల కోసం వినియోగిస్తారు. టాప్ 4 అంతస్తులను వాణిజ్య ఉపయోగాలకు సిద్ధం చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, ఆధునిక మౌలిక వస్తువులతో రూపొందించబోయే ఈ టవర్.. రాష్ట్రానికి ఒక గుర్తింపుగా నిలవనుంది. ఈ టవర్ నిర్మాణాన్ని 2028 నాటికి పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక.
* రూ. 600 కోట్ల వ్యయంతో..
సుమారు 600 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా 30 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ఒక అంచనా. విశ్వ నగరంగా( World City) అభివృద్ధి చెందనున్న అమరావతికి.. ఈ ప్రాజెక్టు కీలకం. ఎప్పటికీ రాజధాని పరిధిలో భవన నిర్మాణాలు, బేగంపేట- తాడిగడప మధ్య రహదారి విస్తరణ, శాశ్విత శాసనసభ భవనం పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులు నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో.. ఈ జంట టవర్ నిర్మాణానికి పెట్టుబడులు భారీగా వచ్చే అవకాశం ఉంది.
Also Read : అమరావతి పునఃప్రారంభంతో ఆంధ్రా దశ దిశ తిరిగేనా?
* ప్రధానిది అదే విశ్వాసం..
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక్కడ నిర్మించే ప్రతి కట్టడం ఒక అద్భుతమే. ఇటీవల ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) స్వయంగా అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పాక్ తో యుద్ధ నేపథ్యంలో.. బిజీగా ఉన్న ఆయన.. అమరావతి విషయంలో మాత్రం ప్రత్యేక ఆసక్తి చూపుతూ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తారని తనకు నమ్మకం ఉందని ప్రధాని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండడంతో ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముందుగా ఈ జంట ఐకానిక్ టవర్లను నిర్మించి.. అమరావతి పై సానుకూలత తేవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే 2028 నాటికి ఈ టవర్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.