Amaravati Re Launch: ఇప్పుడు సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ సిటీ గురించి మరో విధమైన చర్చ మొదలైంది. టిడిపి అనుకూలమైన మీడియాలో ఏపీ స్టేట్ క్యాపిటల్ గురించి అనుకూలమైన చర్చ సాగుతోంది. అమరావతి నిర్మాణం పూర్తయితే ఏపీ దశ, దిశ పూర్తిగా మారుతుందని.. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో గొప్ప స్థానాన్ని ఆక్రమిస్తుందని టిడిపి అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే అమరావతిలో విస్తృతమైన సముద్ర మార్గం ఉంది. దేశంలో గుజరాత్ తర్వాత ఆ స్థాయిలో తీర రేఖ కలిగిన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అందువల్ల నౌకయానానికి.. సముద్ర రవాణాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తే సరుకు రవాణాకు అనుకూలంగా ఉంటుంది. మనదేశంలో ఉన్న ముంబై, చెన్నై ఇటువంటి మహానగరాలు సముద్రం ఒడ్డునే ఉన్నాయి. ఈ నగరాలు విపరీతంగా అభివృద్ధి చెందడానికి సముద్రం కూడా ఒక కారణం.
ఆ విషయాలను పక్కన పెట్టారు
సహజంగా ఒక ప్రాంతం గురించి గొప్పగా చెప్పాలంటే.. దాని అనుకూలతలను వివరించాలి. ప్రతికూలతలు కూడా చెప్పాలి. కాకపోతే ప్రతికూలతల కంటే అనుకూలతలు ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఆ ప్రాంతం గురించి చర్చ మొదలవుతుంది. అంతే తప్ప ప్రతికూలతలను పక్కనపెట్టి.. అనుకూలతల గురించి గొప్పగా చెబితే వినే వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. అమరావతి విషయంలోనూ టిడిపి అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం కూడా ఇలానే ఉంది. దేశానికి రెండవ రాజధానిగా అమరావతి అవుతుందని.. అమరావతి ప్రాంతానికి అన్నీ అనుకూలతలు ఉన్నాయని డబ్బా కొడుతోంది. వాస్తవానికి ఇప్పటికీ ఏపీ రాజధానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. అధికారిక గెజిట్ లో ఆ ప్రాంతాన్ని రాజధాని అని ప్రకటించలేదు. అక్కడిదాకా ఎందుకు ఆ ప్రాంతానికి కేంద్రం ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేదు. ఇక మన దేశ పార్లమెంటు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఇంతవరకు ఆమోదించలేదు. ఇన్ని ప్రతికూలతలు కళ్ళముందు కనిపిస్తున్నప్పటికీ.. ఈ ప్రాంత క్యాపిటల్ సిటీని దేశానికి రెండవ రాజధాని అని చెప్పటం నిజంగా ప్రజలను మోసం చేయటమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రపంచ పటంలో పెట్టాలి అనుకున్నప్పుడు.. ఆ స్థాయిలో భూసేకరణ జరిపి.. అన్ని గ్రామాలను విలీనం చేసుకున్న తర్వాత.. ఇంతవరకు గ్రీన్ క్యాపిటల్ సిటీ ఎందుకు నిర్మించలేకపోయారని.. ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు ఎందుకు కాలయాపన చేశారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా దేశానికి సెకండ్ క్యాపిటల్.. ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీ.. అని విశ్లేషణలు పక్కన పెట్టి.. త్వరగా రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుందని… ఆ తర్వాత దేశానికి రెండవ రాజధానిగా చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.