Amaravati Re Launch: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ఈరోజు సాయంత్రం వెలగపూడి వేదికగా అశేష జన వాహిని నడుమ శంకుస్థాపన చేస్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. గత పది నెలలుగా నిధుల సమీకరణ పూర్తి చేసింది కూటమి ప్రభుత్వం. కేంద్రం సైతం నిధులు కేటాయించడంతో.. రెట్టింపు ఉత్సాహంతో అమరావతి పునర్నిర్మాణ పనులు మొదలు పెట్టనుంది. గత అనుభవాల దృష్ట్యా 2028 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది.
Also Read: ఆంధ్రుల కల.. అమరావతి పునః ప్రారంభం నేడే!
* కొంగొత్త ఆశలతో
వాస్తవానికి 2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. నాడు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటి టిడిపి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను కూడా ప్రారంభించింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం అయ్యింది. జగన్ సర్కార్ భావించిన మూడు రాజధానుల అంశం కూడా అడుగు ముందుకు వేయలేకపోయింది. అందుకే గత ఐదేళ్లలో అమరావతి అభివృద్ధి కాక.. మూడు రాజధానులు ఏర్పాటు చేయలేక.. రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయింది. అందుకే ఈసారి అమరావతిని కదిలించలేని స్థితిలో.. పార్లమెంటు లోనే చట్టం తేవాలని భావిస్తున్నారు. వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని చూస్తున్నారు.
* నవ నగరాలు టార్గెట్
అమరావతిలో నవ నగరాలు( 9 cities ) నిర్మించాలన్నది లక్ష్యం. అందుకు అనుగుణంగా నిర్మాణాలు జరపనున్నారు. ముందుగా రాష్ట్ర సచివాలయం, హై కోర్ట్, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల భవనాలు నిర్మించనున్నారు. ఐకానిక్ టవర్లలో వీటిని నిర్మాణం ఉంటుంది. దాదాపు 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. సంబంధిత టెండర్ దక్కించుకున్న సంస్థలు నిర్మాణాలను ప్రారంభించునున్నాయి. పనులకు శంకుస్థాపన మొదలు.. నిరాటంకంగా పనులు జరిపించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. 2028 నాటికి అమరావతి నిర్మాణ పనులు పూర్తిచేసి.. 2029 ఎన్నికలకు వెళ్లాలని కూటమి భావిస్తోంది.
* జాతీయ రహదారులకు శ్రీకారం
అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి లక్ష కోట్ల పెట్టుబడులతో చేపట్టనున్న పనులకు సైతం శంకుస్థాపన చేస్తారు. నాగాయలంకలో( Nagayalanka ) రూ.1460 కోట్లతో క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తారు. ముద్దునూరు నుంచి హిందూపురం వరకు జాతీయ రహదారి 716ను 57 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. ఇందుకుగాను రూ.1020 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇదే హైవేలో గోరంట్ల నుంచి హిందూపురం వరకు రూ.809 కోట్లతో 34 కిలోమీటర్ల నాలుగు వరుసల రోడ్డును విస్తరిస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులకు సంబంధించి నిర్మాణాలు, రోడ్డు విస్తరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
Also Read: నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి అర్ధం అయ్యేది కాదు : పవన్ కళ్యాణ్