Amaravati : ఏపీలో( Andhra Pradesh) నామినేటెడ్ పదవుల భర్తీ మరోసారి జరిగింది. 22 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమిస్తూ జాబితా విడుదల అయింది. మూడు పార్టీలకు ప్రాధాన్యం ఇస్తూ నామినేటెడ్ పదవులు కేటాయించారు. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి, ఒత్తు ధర్మం పాటించిన వారికి అవకాశం కల్పించారు. టిడిపికి 16, జనసేనకు మూడు, బిజెపికి ఒక చైర్మన్ పదవి దక్కింది. అమరావతి జేఏసీ రెండు పదవులు దక్కించుకుంది. గత ఎన్నికల్లో వివిధ సమీకరణలో భాగంగా టికెట్లు ఇవ్వలేని వారికి, కూటమి పొత్తులో భాగంగా టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం కల్పించారు. నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇచ్చారు.
Also Read : మూడేళ్లలో అమరావతి.. ఆ పనులు చేస్తేనే సాధ్యం!
* వీరాంజనేయులు కు బంపర్ ఆఫర్..
ఏలూరు జిల్లా( Eluru district) టిడిపి అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు బంపర్ ఆఫర్ దక్కింది. ఆయనకు రెండు పదవులు వచ్చాయి. ఏలూరు డిసిసిబి చైర్మన్ తో పాటు ఆప్కాబ్ చైర్మన్ పదవి వరించింది. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో అమరావతి జేఏసీలో చురుగ్గా పాల్గొని పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు దక్కాయి. మహిళా నేత రాయపాటి శైలజకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు సీఎం చంద్రబాబు. అమరావతి ఉద్యమంలో శైలజాది కీలక పాత్ర. అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవెల్లి వంటి ఆధ్యాత్మిక పాదయాత్రలు చేశారు. ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఆమెకు అవకాశం దక్కింది.
* మాజీ మంత్రి కి అవకాశం..
మాజీమంత్రి కే ఎస్ జవహర్ కు( KS Jawahar ) ఎస్సీ కమిషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. గత ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆయన టికెట్ ఆశించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆయనకు నామినేటెడ్ పదవి దక్కింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలపై విధ్వంసం పేరిట పుస్తకం రాశారు ప్రముఖ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్. ఆయనకు ప్రెస్ అకాడమీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డికి కూడా నామినేటెడ్ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఆయనను ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్గా నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* చైర్మన్లు వీరే
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ( Raayapaati sailaja ), ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్, ఆంధ్రప్రదేశ్ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ డాక్టర్ శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ విద్య మరియు సంక్షేమ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ, ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణాల కార్మికుల బోర్డు చైర్మన్ వలవల బాబ్జి, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బురుగుపల్లి శేషారావు, ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వాణి వెంకట శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్ ఎన్నార్టీ సొసైటీ చైర్మన్ డాక్టర్ రవి వేమూరు, ఆంధ్రప్రదేశ్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ కొల్లు పెద్దిరాజు, ఆంధ్ర ప్రదేశ్ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రేరేపి ఈశ్వర్, వడ్డెర సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ స్వామి, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ లీలా కృష్ణ, ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ రియాజ్, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ సోల్ల బోజిరెడ్డిలు నియమితులయ్యారు.
Also Read : అమరావతి పునఃప్రారంభంతో ఆంధ్రా దశ దిశ తిరిగేనా?