Baby Cheetah: ఊరిలో ప్రజలు ఆవులను, బర్రెలను మేపడానికి కొండకు, గుట్టకు వెళ్తుంటారు. ఉదయం వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు. వారి ప్రయాణంలో ఎన్నో పక్షులు, జంతువులు, సరీసృపాలను చూస్తుంటారు. ఇక పాములు, తేళ్లు అయితే ఎన్నో కనిపిస్తుంటాయి కూడా. అయితే ఇప్పుడు మనం ఒక వింత ఘటన గురించి తెలుసుకుందాం. జీవాలను మేపేందుకు వెళ్లిన కొందరికి ఏం కనిపించిందో తెలుసా?
జీవాలను మేపేందుకు ఊరు చివర కొండల వద్దకు వెళ్లారు స్ధానికులు. సడన్ గా అక్కడ చిరుత పులి పిల్ల కనిపించడంతో ఏం చేయాలో తోచక చాలా భయపడ్డారట.ఈ ఘటన నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. డోన్ మండలం చనుగొండ్ల దగ్గర చిరుత కనిపించినట్లు తెలిపారు స్థానికులు. గ్రామానికి పక్కనే ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పిల్ల కనిపించడంతో.. స్థానికుల్లో భయం నెలకొంది. పిల్ల చిరుత ఉందంటే.. తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలోనే ఉండి ఉంటుందనీ, ఏక్షణంలో ఎవరిపై దాడి చేస్తుందో అని భయపడుతున్నారు.
ఆ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు.. అటు వైపు వెళ్లాలంటేనే భయంతో వణుకుతున్నారు. కాగా, కొండల్లో కనిపించిన ఆ బుజ్జి చిరుత పిల్లను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ చిన్న చిరుత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదెలా ఉంటే గతంలో చిరుత వెంకటాపురం సమీపంలోని కొండ గుహల్లో కనిపించిందని తెలిపారు. అక్కడ రాళ్ల మధ్యలో ఉంటూ అటు వైపుగా వెళ్లే పశువుల మీద దాడి చేసిందని తెలిపారు స్థానికులు. అయితే కొండ ప్రాంతానికి ఆనుకొని గ్రామంలో ఇళ్లు ఉండటంతో జంతువులు కనిపిస్తున్నాయి అని.. అందుకే వారికి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.