Alert AP
Alert AP : తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు సుర్రుమంటున్నాడు. మార్చి నెల మొదటి వారం నుంచే నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో పిల్లలు, వృద్ధులు, కూలీలు అల్లాడుతున్నారు. సాధారణం కన్నా మూడు నాలుగు డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో వేడి (Heat)తీవ్రత ఎక్కువగా అనిపిస్తోంది. ఉక్కపోత పెరుగుతోంది. దీంతో జనం మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రావడంలేదు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఐఎండీ మరో హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నేడు(మార్చి 19), రేపు (మార్చి 20) వేడి గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి(Amaravathi)లోని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది, ముఖ్యంగా రాయలసీమ మరియు కోస్తా ప్రాంతాల్లో పలు చోట్ల వడగాల్పులు నమోదయ్యే సూచనలు ఉన్నాయి.
Also Read : ఏం ఎండలురా బాబూ.. ఇంత ఎండలూ ఎప్పుడూ చూడలా.. ఏపీలో ప్రజలకు అలెర్ట్
వాతావరణ సూచన..
బుధ, గురు వారాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా ఉండవచ్చని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను కూడా దాటే అవకాశం ఉంది. వడగాల్పులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రంగా ఉండే సంభావ్యత ఉంది.
జాగ్రత్తలు..
ఎండలో ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్తపడండి, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు.
తగినంత నీరు తాగండి, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోండి.
సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో ఉండటం మంచిది.
లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించండి.
అత్యవసరమైతేనే బయటకు రావాలి..
ఇక ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు వేడి గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు రెండు రోజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు, ఎండలో పనిచేసేవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. తలకు రుమాలు లేదా టోపీ ధరించాలని పేర్కొంటున్నారు. శరీరం డీ హైడ్రేట్ కాకుండా నిమ్మరసం, నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : ఐదు రోజులు జాగ్రత్త.. లేదంటే భానుడి దెబ్బకు అబ్బా అనాల్సిందే..!