https://oktelugu.com/

Ramoji Rao: విషాద వేళలో.. ప్రతీకారానికి ఇదా సమయం?

తెలుగులో పత్రికా రంగంలో వినూత్న మార్పులకు కారణమైన రామోజీరావు.. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల 45 నిమిషాలకు హైదరాబాదులోని నానక్ రామ్ గూడ స్టార్ ఆస్పత్రిలో చనిపోయారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 8, 2024 4:42 pm
    Ramoji Rao

    Ramoji Rao

    Follow us on

    Ramoji Rao: ఆపద వేళలో శత్రువుకైనా చేయి అందించాలంటారు పెద్దలు. కష్టాల్లో ఉన్నప్పుడు మన వంతు సాయం చేయాలని సూచిస్తుంటారు. కానీ కొంతమందిలో మానవత్వం రోజురోజుకూ చచ్చిపోతోంది. వారు ఒక మనిషి చనిపోయి ఉన్నప్పటికీ.. పరామర్శలు పక్కన పెడితే ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఉద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు.. ఇలాంటివి చూసిన వారికి ఏవగింపు కలుగుతుంది.. ఛీ…వీళ్లూ మనుషులేనా అనిపిస్తోంది..

    తెలుగులో పత్రికా రంగంలో వినూత్న మార్పులకు కారణమైన రామోజీరావు.. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల 45 నిమిషాలకు హైదరాబాదులోని నానక్ రామ్ గూడ స్టార్ ఆస్పత్రిలో చనిపోయారు. శ్వాస కోశ సంబంధ సమస్య, ఇతర అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల వచ్చిన సమస్యలతో ఆయన కన్నుమూశారు. రామోజీరావు బతికి ఉన్నప్పుడు కొంతమందికి టార్గెట్ అయ్యారు.. మరి కొంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. ఇందులో ఎవరికోణం వారికి ఉంటుంది. ఎవరినీ తప్పు పట్టాల్సిన పనిలేదు. అందరికీ నచ్చాలంటే రామోజీరావు దేవుడు కాదు.. ఓ సాధారణమైన మనిషి. కానీ అలాంటి మనిషి చనిపోయినప్పుడు సాటి మనుషులుగా అయ్యో అని సానుభూతి చూపించడం, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించడం, కుటుంబానికి ధైర్యం చెప్పడం ప్రాథమిక కర్తవ్యాలు. ఇవన్నీ ఎవరూ చేయాలని చెప్పరు. స్వతహాగానే ఇలాంటి బుద్ధులు మనుషులకు అలవడాలి. కానీ కొంతమంది రామోజీరావు మరణం సందర్భంగా చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న పోస్టులు మిగతా వారికి ఇబ్బంది కలగజేస్తున్నాయి. వారి పుట్టుకనే ప్రశ్నించే పరిస్థితులను కలగజేస్తున్నాయి.

    వాస్తవానికి ఇటీవల ఎన్నికల్లో ఈనాడు పక్కాగా టిడిపికి అనుకూలంగా పనిచేసింది. జగన్ పై విపరీతమైన నెగెటివిటీ ప్రచారం చేసింది. జగన్ వల్ల తన ఆర్థిక స్తంభమైన మార్గదర్శి కూలిపోతుంటే తట్టుకోలేక రామోజీరావు ఈ పని చేశాడని చెబుతుంటారు. అలా చేసినప్పుడు జగన్, జగన్ వర్గీయులలో కోపం రావడం సహజం. పైగా ప్రధాన పత్రికగా చలామణి అవుతున్న ఈనాడులో అలాంటి వ్యతిరేక కథనాలు రావడం జగన్ క్యాంపుకు నష్టం చేకూర్చింది. వాస్తవానికి జగన్, రామోజీరావుకు మొదట్లో అంత వైరం ఉండేది కాదు. కానీ ఆ తర్వాత అది తారస్థాయికి చేరింది. జగన్ వ్యవస్థలను అడ్డంపెట్టుకుని రామోజీరావు మీదకి వెళ్తే.. రామోజీరావు తన ఈనాడు ద్వారా జగన్ మీదకు వెళ్లాడు. స్థూలంగా చూస్తే రెండు బలమైన శక్తులు కొట్లాడుకున్నాయి. కాకపోతే ఇందులో అంతిమంగా విజేత ఎవరు అంటే.. పెద్ద పెద్ద వ్యక్తులు కూడా రామోజీరావు ఇంటి వైపు చూడని సందర్భంలో ఏకంగా సిఐడిని విచారణకు పంపించాడు జగన్. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకొని తిరుగులేని రికార్డు సాధించిన వైసీపీని.. ఈసారి 11 స్థానాలకే పరిమితమయ్యేలా చేశాడు ఈనాడు రామోజీరావు. మొత్తంగా ఒకసారి ఒకరిదిపై చేయి, మరొకసారి ఇంకొకరిది పై చేయి. వాళ్లంతా పెద్ద స్థాయి వ్యక్తులు.. ఎప్పుడో ఒక సారి కలిసి పోక తప్పదు. కానీ ఈ మధ్యలో ఉన్నవాళ్లు రెచ్చిపోతున్న తీరు ఆవేదన కలిగిస్తోంది. ముఖ్యంగా రామోజీరావు మరణం తర్వాత వైసిపి అనుకూల నెటిజన్లు పెడుతున్న పోస్టులు.. చేస్తున్న వ్యాఖ్యలు.. మీమ్స్ చిరాకు కలిగిస్తున్నాయి.. ఇలాంటి సందర్భంలోనే కొంతమంది స్పందిస్తున్నారు. మనిషి చనిపోయి.. ఇబ్బందుల్లో ఉంటే.. ఇలాంటి కామెంట్లు చేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు.. ఏమైనా విరోధముంటే నేరుగా ఎదుర్కోవాలి కానీ.. ఇలా దుఃఖంలో ఉన్నప్పుడు నిందించడం తగదని హితవు పలుకుతున్నారు.