HomeతెలంగాణSanath Nagar Geyser Incident : గీజర్‌ గ్యాసే ప్రాణాలు తీసింది... సనత్‌నగర్‌ ఘటనలో ప్రాథమికంగా...

Sanath Nagar Geyser Incident : గీజర్‌ గ్యాసే ప్రాణాలు తీసింది… సనత్‌నగర్‌ ఘటనలో ప్రాథమికంగా నిర్ధారణ.. ఆ గ్యాస్‌ చాలా డేంజర్‌!

Sanath Nagar Geyser Incident : హైదరాబాద్‌: నగరంలోని సనత్‌నగర్‌లోని జెక్‌ కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌లో ఆదివారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. మృతులు సిగ్నోడ్‌ ట్రాన్సిస్ట్‌ ప్యాకింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలో బిజినెస్‌ హెడ్‌ గా పని చేసే వెంకటేశ్‌(59), ఆయన భార్య మాధవి(52) , కుమారుడు హరికృష్ణ (25)గా గుర్తించారు. జెక్‌ కాలనీలో ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌ మెంట్‌లోని తమ ఫ్లాట్‌లో మృతిచెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఫ్లాట్‌కు వచ్చి తలుపులు పగులగొట్టి లోనికివెళ్లి చూశారు. ఈ క్రమంలో ఫ్లాట్‌లోని బాత్‌రూంలో ముగ్గురూ విగతజీవులుగా కనిపించారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొదట విద్యుత్‌షాక్‌ కారణం అయి ఉంటుందని భావించారు. తర్వాత ఎవరైనా చంపి ఉంటారేమో అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. కానీ, చివరకు ముగ్గురి మృతికి విషవాయువు కారణమని గుర్తించారు. ఆ వాయవు పీల్చడం ద్వారానే ముగ్గురూ మృతిచెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా నిర్ధారించారు.

కొడుకుకు స్నానం చేపించేందుకు..
వెంకటేశ్‌–మాధవి దంపతుల కొడుకు హరికృష్ణ మానసిక దివ్యాంగుడు. శనివారం హరికృష్ణకు స్నానం చేయించేందుకు తల్లిదండ్రులు బాత్‌రూంకు వెళ్లారు. అయితే బాత్‌రూంలోని గీజర్‌ నుంచి వెలువడిన విషయాయువులను వారు పీల్చడంతో ముగ్గురూ మృతిచెందారు. రంగు, వాసన లేని కార్బన్‌ మోనాక్సైడ్‌ గీజర్‌ నుంచి విడుదల కావడంతో దానిని గుర్తించేలోపే ముగ్గురూ స్పృహతప్పి మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 8:30 గంటల దాటినా వెంకటేశ్‌ ఫ్లాట్‌ నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పక్క ఫ్లాట్‌వారు పోలీసులకు సమాచారం అందించారు.

గీజర్‌ గ్యాస్‌ చాలా డేంజర్‌..
ఇటీవల బెంగళూరులో గీజర్‌ నుంచి వెలువడిన విషవాయువు కారణంగా 35 ఏళ్ల మహిళ, ఆమె 7 ఏళ్ల కూతురు మరణించింది. గీజర్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయిందని, కిటికీ మూసి ఉండడంతో విషవాయువు రావడంతో ఊపిరాడక ఇద్దరూ చనిపోయారని నివేదికలో తేలింది. తాజాగా హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో ముగ్గురు మృతిచెందారు. అంటే ఈ ప్రమాదం గ్యాస్‌ గీజర్‌ వినియోగదారులకు ప్రమాద ఘంటికలు మోగించినట్లయింది. గ్యాస్‌ గీజర్‌ ఉపయోగిస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చు.

గ్యాస్‌ గీజర్‌ ఇలా పనిచేస్తుంది..
గ్యాస్‌ గీజర్‌ విద్యుత్‌ గీజర్‌ కంటే భిన్నంగా ఉంటుంది. ఇది ఎల్‌పీజీ ద్వారా నడుస్తుంది. నీటిని వేడి చేస్తుంది. దీనిలో ట్యాంక్‌ దిగువన ఒక బర్నర్‌ ఉంటుంది. అయితే వేడి నీరు పైపు ద్వారా దిగువకు చేరుకుంటుంది. విద్యుత్‌ పనిచేసే గీజర్ల కంటే గ్యాస్‌ గీజర్లు చౌకగా ఉంటాయి. దీని వినియోగం కూడా చాలా తేలికగా ఉంటుంది. చాలా మంది గ్యాస్‌ గీజర్లను బిగించుకుంటున్నారు.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..

1. మూసివేసిన ప్రదేశాలలో గ్యాస్‌ గీజర్‌ను ఎప్పుడూ ఇన్‌స్టాల్‌ చేయొద్దు. బాత్‌రూమ్, కిచెన్‌ వంటి ప్రదేశాల్లో దీన్ని అమర్చినట్లయితే వెంటిలేటర్లను ఎప్పుడూ తెరిచి ఉంచాలి. అలాగే ఎగ్జాస్ట్‌ ఫ్యాన్‌ బిగించుకోవాలి.

2. గ్యాస్‌ గీజర్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. ఏదైనా లీకేజీ లేదా మరేదైనా సమస్య ఉంటే బయటపడే అవకాశాలు ఉంటాయి.

3. రోజంతా గ్యాస్‌ గీజర్‌ను వినియోగించడం సరికాదు. నిరాటంకంగా వినియోగిస్తే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.

4. గ్యాస్‌ గీజర్‌ కారణంగా ఎవరైనా సమస్యలను ఎదుర్కొంటే, బాధితుడిని వీలైనంత త్వరగా బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్లాలి. తద్వారా అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.

5. బాత్రూంలో స్నానం చేయడం ప్రారంభించే ముందు గ్యాస్‌ గీజర్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేయండి. దీంతో స్నానం చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉండదు.

6. గ్యాస్‌ గీజర్‌లో లీకేజీ ఉంటే, దాని నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు బయటకు వస్తుంది. ఇది మైకం, వికారం, వాంతులు, అలసట, కడుపు నొప్పికి కారణం కావచ్చు.

7. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో స్నానం చేసే సమయంలో లేదా తర్వాత అలాంటి సమస్య ఏదైనా కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లండి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version