Aadudam Andhra Scam: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో భారీ కుంభకోణాలు జరిగాయని కూటమి ఆరోపిస్తోంది. ఇప్పటికే చాలా స్కాంలపై విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు 40 మంది వరకు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 12 మంది అరెస్టు అయ్యారు కూడా. మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయనుంది. దాదాపు 18 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని తేల్చింది. రూ.3500 కోట్ల కుంభకోణం జరిగిందన్నది ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అయితే ఈ కేసులో కీలక అరెస్టులు జరిగాయి. త్వరలో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేలనుంది. అయితే తాజాగా మరో కుంభకోణం పై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈరోజు మరో కుంభకోణానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక డిజిపి కి చేరనుంది. తద్వారా దీనిపై అరెస్టులు చేసే అవకాశం కనిపిస్తోంది.
Also Read: బలవంతపు సలహాలు.. చంద్రబాబు పట్టించుకుంటారా?
రూ.120 కోట్ల అవినీతి..
2024 సంక్రాంతికి ముందు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఆడుదాం ఆంధ్ర( Adudham Andhra) పోటీలు నిర్వహించారు. ఐదేళ్ల వైసిపి పాలనలో క్రీడల నిర్వహణ తూతూ మంత్రంగా జరిగింది. అయితే దీనిపై విమర్శలు రావడంతో ఎన్నికలకు ముందు.
.. ఆడుదాం ఆంధ్ర పేరిట క్రీడా పోటీలు నిర్వహించారు. అప్పట్లో వైసీపీ కార్యకర్తలతోనే ఆటలు పూర్తి చేశారని.. వాలంటీర్లే ఎంపైర్లుగా మారారని.. అసలు కొన్ని ప్రాంతాల్లో పోటీలు నిర్వహించకుండానే వైసీపీ శ్రేణులను విజేతలుగా ప్రకటించి నగదు అందించారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో రూ.120 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూటమి ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దాదాపు అన్ని జిల్లాల్లో విజిలెన్స్ వివరాలు సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ఈరోజు రాష్ట్ర డిజిపి కి నివేదిక ఇవ్వనుంది విజిలెన్స్ కమిటీ. దీంతో డిజిపి అరెస్టుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. దీంతో కీలక వ్యక్తుల అరెస్టు జరిగే అవకాశం కనిపిస్తోంది.
అనేక రకాలుగా ఆరోపణలు..
అప్పట్లో క్రీడల శాఖ మంత్రిగా వ్యవహరించారు ఆర్కే రోజా( RK Roja). ఆమెతోపాటు నాడు శాప్ చైర్మన్గా ఉండేవారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. క్రీడల నిర్వహణ, ఖర్చులు, క్రీడా పరికరాలు.. ఇలా అన్నింటా అప్పట్లో చేతివాటం ప్రదర్శించారని విమర్శలు ఉన్నాయి. నాసిరకం క్రీడా సామాగ్రి కొనుగోలు చేసి భారీగా నిధులు పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించి.. వ్యాయామ ఉపాధ్యాయులకు చెల్లింపులు కూడా చేయలేదు. నాడు క్రీడాకారులకు సరైన వసతులు కల్పించలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే క్రీడా పోటీలు నిర్వహించకుండానే.. నిర్వహించినట్లు చూపించి నిధులు కాజేశారు అనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి ఏ క్రీడకైనా.. పోటీలు నిర్వహిస్తే కచ్చితంగా స్కోర్ బోర్డ్స్ సీట్స్ ఉంచాలి. కానీ నాడు ఆడుదాం ఆంధ్రకు సంబంధించి ఈ స్కోర్ బోర్డ్స్ సీట్స్ కనిపించడం లేదు. అప్పట్లో అందించిన క్రీడా సామాగ్రి కూడా ఇప్పుడు లేవు. అప్పట్లో ఆడే సమయంలోనే చాలా రకాల సామాగ్రి పోయింది. కేవలం నాసిరకం కంపెనీలకు క్రీడా సామాగ్రి పంపిణీ బాధ్యతలు అప్పగించి భారీగా సొమ్ము పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ విజిలెన్స్ విచారణలో తేలాయి.
Also Read: రాహుల్ గాంధీతో జగన్ భేటీ
ఆ ఇద్దరి అరెస్ట్..
అయితే ఆడుదాం ఆంధ్ర కేసులో మాజీ మంత్రి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి( baireddy Siddharth Reddy ) అరెస్ట్ తప్పదని ప్రచారం నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు టిడిపి కూటమి విషయంలో దూకుడుగా వ్యవహరించిన వారే. చాలా రకాల ఆరోపణలు చేసిన వారే. అందుకే వీరి అరెస్టు తప్పకుండా ఉంటుందని ప్రచారం నడుస్తోంది. డీజీపీకి ఈరోజు విజిలెన్స్ విచారణ చేరనుంది. మరి ఆయన ఎలాంటి ఆదేశాలు ఇస్తారో చూడాలి.