Chandrababu Compelling Advice: చంద్రబాబుకు( CM Chandrababu) సరికొత్త చిక్కు వచ్చి పడింది. ముఖ్యంగా ఆయనకు సలహాదారులు ఎక్కువవుతున్నారు. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే వరకు అందరూ సలహాలు ఇస్తున్నారు. పార్టీ దారి తప్పుతోందని.. ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల పనితీరు బాగాలేదని.. సంక్షేమ పథకాలు కరెక్ట్ కాదని.. ఇలా తమకు తోచిన విధంగా సలహాలు ఇస్తున్నారు. అయితే వీరి సలహాలను చంద్రబాబు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ.. వీరి సలహాల ద్వారా మాత్రం తెలుగుదేశం పార్టీతో పాటు కూటమికి నష్టం జరుగుతోంది. ఏదో జరుగుతోందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
Also Read: రాహుల్ గాంధీతో జగన్ భేటీ
* పేదరికం లేని సమాజం కోసం..
సమాజంలో కనీస మౌలిక వసతులు లేకుండా.. ఇబ్బంది పడుతున్న నిరుపేదల సంక్షేమం కోసం పి 4 కార్యక్రమాన్ని ప్రారంభించారు చంద్రబాబు. ఇదే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పారు. పేదరికం పై పోరాటం చేస్తామని చెప్పారు. సేవా గుణం ఉన్న వారితో పేదలని బాగు చేయించి.. నిరుపేదలను పేదరికం నుంచి బయటకు తీసుకు వస్తానని చెప్పారు. ఇప్పటికిప్పుడు చేసిన ఆలోచన కాదు అది. కానీ ఇప్పుడు దానిని తప్పు పడుతున్నారు టిడిపి సోషల్ మీడియా యాక్టివిటీలు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ( ABN Andhra Jyothi Radhakrishna ) లాంటి సన్నిహితులు. అయితే అది ఏమంత చిన్న కార్యక్రమం కాదు. దాని ఫలితాలు రావాలంటే కొద్దిరోజుల సమయం పడుతుంది. కానీ ఆదిలోనే దానిని తుంచేయ్యాలని చూస్తున్నారు ఈ సరికొత్త సలహాదారులు. ఇప్పుడిప్పుడే ఆ కార్యక్రమం ప్రారంభం అయింది. పేదరికంతో అలమటించే వారిని బంగారు కుటుంబాలుగా.. వారిని దత్తత తీసుకుని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వారిని మార్గదర్శకులుగా అభివర్ణిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇంకా మొదలు పెట్టలేదు అప్పుడే విమర్శలు ప్రారంభించారు.
* అమరావతిలోనూ అదే తంటా
అయితే చంద్రబాబు చేస్తున్న ప్రతి పనిని ఈ సలహాదారులు ఆక్షేపిస్తున్నారు. అమరావతి విషయంలో కూడా ఇలానే చేశారు. ఐదేళ్లపాటు స్మశానంగా మార్చిన అమరావతిని( Amravati Amravati capital) యధా స్థానానికి తీసుకురావడం అంత చిన్న విషయం కాదు. నిధుల సమీకరణ ఈజీ కాదు. కానీ దానిని చేసి చూపించారు. అడుగడుగునా అడ్డు తగిలే రాక్షస సైన్యాన్ని పక్కకు తప్పించి మరి అమరావతి నిర్మాణాన్ని పట్టాలెక్కించారు. రెండో విడత భూసేకరణ చేసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రకటిస్తే.. మొదటి విడత సమీకరించిన భూములకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. దానిని కూడా తప్పు పట్టారు ఈ అనుకూల సలహాదారులు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదని రచ్చ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సాయం చేసినట్టే.
* సహనం ఎక్కువ..
ఏపీ సీఎం చంద్రబాబులో సహనం ఎక్కువ. ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చిన మౌనంగా వింటారే తప్ప.. ఎదురు తిరిగి సమాధానం చెప్పరు. ఇతరులు చెప్పిన దాంట్లో తాను చేయాలనుకున్న దానికి మెరుగైన అంశం ఉంటే గ్రహిస్తారు. అయితే ఇప్పుడు చంద్రబాబును భయపెట్టి సలహాలు ఇస్తున్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారు. అయితే చిత్తశుద్ధితో జరిగే ప్రయత్నం సత్ఫలితం ఇస్తుంది. దానినే నమ్ముతారు చంద్రబాబు. కానీ తాము ఇచ్చే సలహాలు పాటించాలని సూచిస్తున్నారు ఈ బలవంతపు సలహాదారులు.