Virus : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్ల ఫారం లో వైరస్ విజృంభిస్తోంది. వేలాది కోళ్ల మరణానికి కారణమైంది. దీంతో చాలామంది రైతులు పౌల్ట్రీ ఫారాలను ఖాళీగా వదిలేస్తున్నారు. చనిపోయిన కోళ్లను జెసిబి లతో పెద్దపెద్ద గొయ్యిలు తీసి పూడ్చి వేస్తున్నారు. ” ఇప్పటికే కోళ్ల వయసు 35 రోజులకు వచ్చింది. మరో ఐదు రోజుల్లో బయటికి పంపిస్తామనగా ఒక్క కోడి కిందపడి కొట్టుకొని చనిపోవడం మొదలైంది. ఇలా అన్ని కోళ్లు చనిపోవడంతో పెట్టిన పెట్టుబడి.. చేసిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. ఇప్పటికే పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాం. వారు కూడా క్షేత్రస్థాయికి వచ్చి చనిపోయిన కోళ్లను పరిశీలించారు. కొన్నింటి శాంపిల్స్ తీసుకెళ్లారు. అయితే ఈ మరణాలకు కారణమేమిటో వారు చెప్పలేకపోతున్నారు. కేవలం ఒక ప్రాంతం అని లేదు.. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని” పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు.
తెలంగాణలో కూడా..
కోళ్లు అర్థంతరంగా చనిపోవడం కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు.. తెలంగాణలో కూడా కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలోని ఆంధ్రకు సరిహద్దుగా ఉన్న పెనుబల్లి మండలంలో వైరస్ సోకి వేలాది కోళ్లు చనిపోవడం విశేషం.. అయితే ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో బ్రాయిలర్, మరి కొన్ని ప్రాంతాల్లో లేయర్ కోళ్ళు చనిపోగా.. తెలంగాణలో మాత్రం బ్రాయిలర్ కోళ్లు మాత్రమే చనిపోయాయి. అయితే ఈ కోళ్లు చనిపోవడానికి వాతావరణంలో మార్పులు.. వైరస్ సోకడమే కారణమని తెలంగాణ పశు సంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. కోళ్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం.. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం.. ఫామ్ లో అపరిశుభ్ర వాతావరణం ఉండడం వల్ల వైరస్ సోకుతోందని అధికారులు చెబుతున్నారు.. అపరిశుభ్రమైన దుస్తులు ధరించి.. కోళ్ల ఫారం లో తిరిగినా కూడా వైరస్ సోకుతుందని అధికారులు అంటున్నారు..” కోళ్లను పెంచే ప్రాంతంలో శుభ్రమైన వాతావరణాన్ని కొనసాగించాలి. శుభ్రమైన దుస్తులు ధరించిన వారు మాత్రమే ఫారంలోకి అడుగు పెట్టాలి. కోళ్లను నిరంతరం కనిపెట్టుకుంటూ ఉండాలి. వాటికి ఏమాత్రం తేడా జరిగినా వెంటనే స్పందించాలి. వాటికి సరైన మందులు వేసి సంరక్షించాలి. అప్పటికి కోళ్లల్లో ఏమైనా అనూహ్యమైన మార్పులు గమనిస్తే.. వెంటనే ఆ కోళ్లను మిగతా వాటికి దూరంగా ఉంచాలని పశు సంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. కోళ్ల పెంపకంలో సరైన చర్యలు చేపడితేనే వైరస్ కట్టడిని అడ్డుకోవడానికి వీలవుతుందని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.