Relationship: మూడు ముళ్లు.. ఏడడుగులు.. పచ్చని పందిళ్లు.. ఊరంతా సందళ్లు.. పంచభూతాల సాక్షిగా.. ఒకరికి ఒకరం అని చేసుకునే ప్రమాణం.. వేద మంత్రాల సాక్షిగా జరిపించేదే మన వివాహం. భారతీయ వివాహం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అన్ని కులాలు, మతాలు వివాహ క్రతువులో భాగస్వాములై ఉంటాయి. అయితే మారుతున్న వివాహ పద్ధతులతో వేడుకల తీరు కూడా మారుతోంది. ఒకప్పుడు 16 రోజులు పెళ్లి వేడుక జరిగేది. నేడు రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లు.. హల్దీ, మెహందీ వేడుకలు డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, బ్యాచ్‌లర్ పార్టీ.. అంటూ ట్రెండ్ వచ్చింది. అయితే ఈ రోజుల్లో వివాహ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. దీంతో బంధాలు ఎక్కువకాలం నిలిచి ఉండడం లేదు. చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు. సర్దుకుపోవడం అనేది కనిపించడం లేదు. ‘ధర్మార్థకామములలోన ఏనాడు.. నీతోడు ఎన్నడూ నేవిడిచిపోను..’ అని చేసుకున్న బాస… మూణ్నాళ్ల ముచ్చటగా మిగులుతోంది. పెళ్లంటే నూరేళ్ల పంట అనేది నిన్నటి తరం నినాదంగా మారింది. నేటి తరానికి అది వర్తిండం లేదు. దేశంలో ఏటా పెరుగుతున్న విడాకుల కేసులే ఇందుకు నిదర్శనం. ఫ్యామిలీ కోర్టుల్లో ఏటా కేసులు పెరుగుతున్నాయి. జీవితాన్ని తమ నియంత్రణలో ఉంచుకోవాలన్న ఆలోచన, వివాహ బంధంలో అసంతృప్తి పాత–ఆధునిక భావాల మధ్య సంఘర్షణ వంటి కారణాలతో జంటలు విడిపోతున్నాయి.
ఏడాది, రెండేళ్లకే…
ఇటీవలి కాలంలో కొత్త జంటలు సర్దుకుపోవడం అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. పైచేయి సాధించడమే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. దీంతో వివాహమైన ఏడాది, రెండేళ్లకే వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నాయి. వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునే ప్రయత్నం జరుగడం లేదు. కాంప్రమైజ్ మార్గం కాకుండా కోర్టు మెట్లు ఎక్కడం కూడా ఒక కారణం అవుతోంది.
విడాకులకు ప్రధాన కారణాలు…
దంపతుల మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం.,
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు
వైవాహిక బంధంలో భావోద్వేగాలు కొరవడడం.
పరస్పర నమ్మకం సన్నగిల్లడం.
జీవితంపై అసంతృప్తి, అభద్రతాభావం పెరగడం.
భిన్నమైన నేపథ్యాలు కలిగి ఉండడం.
స్వతంత్రంగా ఉండాలని కోరుకోవడం
ఉద్యోగులైన దంపతుల్లో పనివేళల్లో అంతరాలు
మద్యపానం, ధూమపానం అలవాట్లు
విడాకుల కేసుల గణాంకాలు..
2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఇండోర్ ఫ్యామిలీ కోర్టులో 8,400 కేసులు ఉండగా, వాటిలో 5,500 విడాకుల కేసులో. వీటిలో 3 వేల కేసులు పెళ్లయిన ఏడాదికే దాఖలైనవి. 2018లో 2,250 కేసులు దాఖలవగా 2,723 కేసులు నమోదయ్యాయి. గడిచిన పదేళ్లలో అత్యధికంగా అక్షరాస్యత ఉన్న కేరళలో విడాకుల శాతం 350కి పెరిగింది. అదే సమయంలో పంజాబ్, హరియాణాలో 150 శాతం పెరిగాయి. ఢిల్లీలో విడాకుల శాతం రెట్టింపైంది. వధూవరుల మధ్య హేతుబద్ధమైన చర్చలు, వాస్తవ పరిస్థితులపై స్పష్టమైన అభిప్రాయాల మార్పిడి జరుగకపోవడం కూడా విడాకుల పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటి. ఇద్దరి అభిప్రాయాలు, జీవన శైలి, అభిరుచులు, ఇష్టాయిష్టాలు, జీతాలు వంటి వాటిపై వాస్తవిక విషయాల గురించి చర్చించకపోవడం, స్థిర, చర ఆస్తులు, వేతనాలు, చదువులు వంటి విషయాల్లోనూ అబద్ధాలు, అవాస్తవాలు చెప్పడం వంటివి పెళ్లి తర్వాత బయటపడుతున్నాయి.
2024 ఏప్రిల్ నాటికి విడాకుల కేసులు (శాతాల్లో)
మహారాష్ట్ర 18.7
కర్ణాటక 11.7
ఉత్తరప్రదేశ్ 8.8
పశ్చిమ బెంగాల్ 8.2
ఢిల్లీ 7.7
తమిళనాడు 7.1
తెలంగాణ 6.7
కేరళ 6.3