Y. S. Rajasekhara Reddy Birth Anniversary: మాట తప్పని.. మడమ తిప్పని నైజం ఆయన సొంతం.. ఎంతటి సమస్యను అయినా ఎదుర్కొనే మొండి ధైర్యం అతని బలం.. రైతులకు అనంతమైన విశ్వాసం.. అపర భగీరథుడిగా జలయజ్ఞం మొదలు పెట్టిన ధీశాలి.. మావనవీయతకు నిలువెత్తు నిదర్శనం.. స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తత్వం.. ఆయనే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీపై చెరగని ముద్రవేసిన వైఎస్సార్ పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా ఆయనపై ప్రత్యేక కథనం.
వైఎస్ బాల్యం.. విద్యాభ్యాసం
కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో యెడుగూరి సందింటి రాజారెడ్డి–జయమ్మ దంపతులకు 1949, జూలై 8న వైఎస్.రాజశేఖరరెడ్డి జన్మించారు. పులివెందులలోని వెంకటప్ప ప్రాథమిక పాఠశాలలో 8వ తరగతి చదివాడు. వైఎస్ రాజారెడ్డి కాంట్రాక్ట్ పనులపై బయట ప్రాంతాల్లో తిరుగుతుండేవారు. దీంతో పిల్లల చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో వైఎస్సార్‌తోపాటు ఆయన సోదరుడు వివేకా, సోదరి విమలమ్మను పులివెందులలోని వెంకటప్ప అనే ఉపాధ్యాయుడి ఇంట్లో వదిలిపెట్టారు.
గురువు ప్రభావం..
వెంకటప్ప కమ్యూనిస్టు.. వైఎస్సార్‌పై గురువు ప్రభావం అధికంగా ఉండేది. 8వ తరగతి తరువాత బళ్లారిలోని సెయింట్ జాన్ స్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేశాడు. విజయవాడ లయోలా కాలేజీలో పీయూసీ, వైద్యవిద్యకు వయసు తక్కువగా ఉండడంతో బళ్లారిలో బీఎస్సీ ఏడాది చదివాడు. అనంతరం గుల్బార్గా ఎమ్మార్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ పూర్తి చేశారు.
రాజకీయ ప్రవేశం..
విద్యార్థి సంఘం నాయకుడిగా వైఎస్సార్ రాజకీయ జీవితం గుల్బర్గా మెడికల్ కాలేజీలో మొదలైంది. ఆ తర్వాత 1975లో యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఎదిగాడు. 1978లో మొదటిసారి రెడ్డి కాంగ్రెస్ తరఫున పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది చట్టసభలో అడుగుపెట్టారు. అప్పటికి ఆయన వయసు కేవలం 29 ఏళ్లు మాత్రమే. ఆ తర్వాత ఇందిర కాంగ్రెస్‌లో చేరారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. నాలుగు సార్లు ఎంపీగా ఓటమెరుగని నేతగా చరిత్రలో నిలిచారు. రాష్ట్ర మంత్రిగా మూడు సార్లు పనిచేశారు. 1980–82లో గ్రామీణాభివృద్ధి, 1982లో ఎక్సైజ్ శాఖ, 1982–83లో విద్యామంత్రిగా సేవలను అందించారు. అలాగే కేవలం 33 ఏళ్ల వయసులో రాష్ట్ర కాంగ్రెస్‌కు సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. 2004,2009లో రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
పాదయాత్రతో ప్రజల గుండెల్లో..
2003, ఏప్రిల్ 9న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్సార్ ప్రారంభించిన పాదయాత్ర ఇటు కాంగ్రెస్‌కు, అటు వైఎస్సార్ జీవితంలో మరుపురానిదిగా నిలిచింది. ఉమ్మడి ఏపీలో 11 జిల్లాల పరిధిలో చేవెళ్ల నుంచి ప్రారంభమైన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకూ 68 రోజులపాటు 1,470 కి.మీల మేర సాగింది. పాదయాత్ర కాంగ్రెస్‌కు ప్రాణం పోసింది. వైఎస్సార్ రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పి అధికారంలోకి తీసుకొచ్చింది. దీంతో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు.
సంక్షేమ సంతకం.. వైఎస్సార్..
రాజకీయాల్లోకి రాకముందు డాక్టర్ అయిన వైఎస్‌కు ప్రజల నాడి బాగా తెలుసు. పాదయాత్ర సందర్భంగా ప్రజల అవసరాలను గుర్తించి అధికారంలోకి రాగానే పథకాలకు రూపకల్పన చేశాడు. మొట్టమొదట రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైల్‌పై సంతకం చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో భావి జీవితానికి బాటలు వేయగా.., ఆరోగ్యశ్రీ పథకంతో పేదరోగులకు ఊపిరిపోశారు. జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు రూపశిల్పి వైఎస్సారే. జలయజ్ఞంతో ప్రాజెక్టులను చేపట్టారు. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చి సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ కర్నూలు–ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో హెలీ క్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. తుది శ్వాస విడిచే వరకూ ప్రజలకు మేలు చేయాలని తపించి మహానేతగా అందరి గుండెల్లో నిలిచిపోయారు.