Bandi Sanjay- Padi Kaushik Reddy: ఒక్కరై రావడం.. ఒక్కరై పోవడం.. ఇదీ మనషి జీవితం పుట్టినప్పుడు ఎవరూ రారు.. పోయేటప్పుడు ఎవరూ రారు. కాకపోతే బతికినన్నాళ్లు చేసిన మంచి, చెడులే అతడి వెంట వస్తాయి. మంచితనం తన కోసం నలుగురు నాలుగు కన్నీటిబొట్లు రాల్చేలా చేస్తుంది. కడసారి చూపునకు వచ్చేలా చేస్తుంది. చెడు చేస్తే.. ఆ నలుగురు కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఓ యువ రాజకీయ నాయకుడు హఠాణ్మరణం చెందాడు. గుండెపోటు ఆయుష్షు తీరుండానే అతడినిక తీసుకుపోయింది. కానీ అతడి మంచితనం.. పార్టీలకు అతీతంగా నాయకలను అంత్యక్రియలకు హాజరయ్యేలా చేసింది. వైరి నాయకులు కూడా అంతిమ యాత్రలో పాల్గొనేలా చేసింది.
బీజేపీ యువనేత మరణం..
హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ యువనేత నందగిరి మహేందర్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఏబీవీపీ నుంచి ఎదిగాడు. తర్వాత రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లోనూ పనిచేశాడు. అన్ని పార్టీల్లో అతడు కలివిడిగా ఉండేవాడు. అందరితో కలిసిపోయేవాడు. ఆత్మీయంగా ఉండేవాడు. ఆత్మీయత చూపేవాడు. మంచివారినే భగవంతుడు త్వరగా తీసుకెళ్తాడు అన్నట్లు మహేందర్‌రెడ్డిని దేవడు గుండెపోటు రూపంలో తీసుకెళ్లాడు.
రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు..
పార్టీలకు అతీతంగా నేతలతో సత్సంబంధాలు కొనసాగించాడు మహేందర్‌రెడ్డి. దీంతో ఆయన మరణ వార్త విని పార్టీలకు అతీతంగా నాయకుల కన్నీరు పెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీ పాడి కౌషిక్‌రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఇద్దరి పార్టీలు వేరే అయినా రాజకీయాలు వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు అని ఇద్దరూ అంతిమయాత్రలో పాల్గొన్నారు. మహేందర్‌రెడ్డి పాడె మోశారు. కుటుంబ సభ్యులు కూడా చేయలేని పని చేశారు.
చివరకు మిగిలేది..
చివరకు మిగిలేవి ఆస్తులు అంతస్తులు కావని మరోసారి నిరూపితమైంది. మంచితనమే మనకు పేరు తెస్తుంది. అదే చనిపోయాక కూడా బతికే ఉంటుంది. ఇది మహేందర్‌రెడ్డి విషయంలో నిజమైంది.