Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రోకర్లు సరికొత్త అవతారం ఎత్తారు.ఏకంగా సిఫార్సు లేఖల కోసం మంత్రులనే ప్రలోభ పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన ప్రారంభం అయింది. కీలక అధికారుల నియామకంతో పాటు త్వరలో పాలకమండలిని సైతం భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కసరత్తు జరుగుతోంది. మరోవైపు తిరుమలలో బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి.అందుకోసమే బ్రేక్ దర్శనాలను సైతం నిలిపివేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తిరుమల వచ్చే అవకాశం ఉంది. వారంతా కనులారా వీక్షించి స్వామి వారిని దర్శించుకున్నారు. ఇటువంటి సమయంలో బ్రేక్ దర్శనాలకు అవకాశం ఇస్తే ఇబ్బందికర పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది. అయితే తిరుమలలో భక్తుల రద్దీని క్యాష్ చేసుకునేందుకు దళారులు ప్రయత్నిస్తున్నారు. శ్రీవారి దర్శన సిఫార్సు లేఖలు తమకు ఇస్తే నెలకు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తామంటూ నేరుగా మంత్రులకి ఆఫర్ ఇస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనతో షాక్ అయిన మంత్రులు కొందరు నేరుగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం ప్రత్యేకంగా స్పందించారు. దర్శన సిఫారసు లేఖల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు. అటువంటి వాటికి అవకాశం ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చారు.
* చాలా రోజులుగా దందా
అయితే తిరుమలలో దళారుల ప్రమేయం ఇప్పటిది కాదు. చాలా రకాల దందా నడుస్తోంది. గతంలో ఓ ఎమ్మెల్సీ సైతం ఈ సిఫార్సు లేఖల విషయంలో అడ్డగోలుగా పట్టుబడ్డారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో మంత్రులు ఇష్టారాజ్యంగా సిఫారసు లేఖలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. లెక్కలేనన్నిసార్లు విఐపి దర్శనాలు చేసుకోవడమే కాదు.. తమ వెంట పదుల సంఖ్యలో అనుచరులను అడ్డగోలుగా తీసుకెళ్లారన్న విమర్శలు ఉన్నాయి. ఈ సిఫారసు లేఖలు నిబంధనలకు విరుద్ధంగా జారీ చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
* నకిలీ టిక్కెట్లతో ఇబ్బందులు
మరోవైపు బ్రోకర్లు, నకిలీ టిక్కెట్లతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం నిఘా అధికారులు చాలాసార్లు వీరిని పట్టుకున్నారు. అయినా ఈ ఫేక్ ను మాత్రం నిరోధించలేకపోతున్నారు. ఇప్పుడు ఏకంగా మంత్రులనే ప్రలోభ పరుచుకొని సిఫారసు లేఖలు ఇవ్వాలని కోరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమలలో పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తామని చెబుతున్నా.. దళారులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
* మహిళా మంత్రికి ఆఫర్
ఇటీవల సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. టీటీడీ పాలకమండలి నియామకం కోసం అధికారులు, మంత్రులతో కలిసి కసరత్తు చేశారు. ఈ సందర్భంగా సిఫారసు లేఖల అంశం చర్చికి వచ్చినట్లు తెలుస్తోంది. ఓ మహిళా మంత్రి తనను దళారులు ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించారు. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు తమ ఆఫర్ ను అంగీకరించారని దళారులు చెప్పిన విషయాన్ని సీఎంకు చెప్పారు. దీంతో సీఎం చంద్రబాబు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిఫారసు లేఖల జారీ విషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు హెచ్చరించారు. అటు సీఎంవో సైతం సిఫారసు లేఖల విషయంలో అలెర్ట్ అయ్యింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: A new round of recommendation letters for visiting tirumala offer lakhs of rupees to ministers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com