https://oktelugu.com/

CM Chandrababu: కొలువుదీరిన చంద్రబాబు సర్కార్.. ఫస్ట్ టైం ఏపీకి సూపర్ ఛాన్స్

ఈ ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించడంతో క్యాబినెట్ కూర్పు కూడా అతి కష్టంగా మారింది. సామాజిక సమీకరణలు, అంతకుమించిఆ రెండు పార్టీలకు నాలుగు మంత్రి పదవులు కేటాయించాల్సి రావడంతో చంద్రబాబుకు కత్తి మీద సాముగా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 12, 2024 / 01:57 PM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో చంద్రబాబు నేతృత్వంలోని మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అతిరథ మహారధుల సమక్షంలో కొత్త పాలకుల ప్రమాణస్వీకారం పూర్తయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకోవడం ఖాయం. ప్రమాణం చేసిన 24 మంది రేపటి నుంచి తమ విధుల్లోకి వెళ్ళనున్నారు. కొత్త పాలన ప్రారంభించనున్నారు. జనసేన తరఫున ముగ్గురు, బిజెపి తరఫున ఒక్కరు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచిన 17 మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మంత్రివర్గంలో కనిపిస్తున్నది యువ రక్తమే. అందుకే ప్రమాణ స్వీకారం సైతం ఉత్సాహంగా సాగిపోయింది.

    ఈ ఎన్నికల్లో కూటమి 164 స్థానాల్లో విజయం సాధించడంతో క్యాబినెట్ కూర్పు కూడా అతి కష్టంగా మారింది. సామాజిక సమీకరణలు, అంతకుమించిఆ రెండు పార్టీలకు నాలుగు మంత్రి పదవులు కేటాయించాల్సి రావడంతో చంద్రబాబుకు కత్తి మీద సాముగా మారింది. అందుకే హేమా హేమీలైన సీనియర్లను పక్కన పెట్టి మరి కొత్తవారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. సహజంగానే అసంతృప్తులు ఉంటాయి. కానీ అవేవీ బయటపడకుండానే ప్రమాణ స్వీకారం సాఫీగా జరిగిపోయింది. చంద్రబాబు,పవన్, లోకేష్ ప్రమాణం చేస్తున్నప్పుడు సభా వేదిక దద్దరిల్లిపోయింది. ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక మెగా కుటుంబమంతా తరలివచ్చింది. పార్టీల ముఖ్య నేతలు, ఇతరులతో గ్యాలరీలన్నీ నిండిపోయాయి.

    అయితే ఏపీ స్టామినాను ఈ విజయం తేల్చి చెప్పింది. గత రెండు ఎన్నికల్లో ఏపీకి రాని అదృష్టం ఈసారి తలుపు తట్టింది. 2014 ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఏకపక్ష విజయం దక్కించుకుంది. అప్పట్లో టిడిపికి వచ్చిన ఎంపీ స్థానాలు అక్కరకు రాలేదు. అందుకే విభజన హామీలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. పోనీ 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయం దక్కింది. అప్పుడు కూడా ఏపీ సాయం కేంద్రానికి అక్కరకు రాలేదు. అప్పుడు కూడా విభజన హామీల కంటే జగన్ స్వప్రయోజనాలకి ప్రాధాన్యం దక్కింది. కానీ 2024 ఎన్నికల్లో దేశ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. బిజెపికి సొంతంగా మెజారిటీ దక్కలేదు. ఎన్డీఏ కూటమిపరంగా అధికారంలోకి రాగలిగారు. అది కూడా టిడిపి సాయంతోనే. అందుకే ఏపీకి ఇంత వైభవం వచ్చింది. ఎన్నడూ ఏపీ ముఖం చూడని జాతీయ నేతలంతా రాష్ట్రానికి క్యూ కట్టారు. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీకి ఇది మహర్దశ. అందుకే విభజన హామీలతో పాటు అపరిస్కృత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ ఈ విషయంలో చంద్ర బాబు తో పాటు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అన్నది తెలియాల్సి ఉంది. గత పది సంవత్సరాల కంటే భిన్నంగా ఏపీకి న్యాయం జరిగితే రాజకీయంగా వైసిపి, కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు రాజకీయ సమాధి అయినట్టే.