Kadambari Jitwani : హీరోయిన్ కాదంబరి జిత్వానీ వ్యవహారంలో కొత్తకోణం.. సంచలన విషయాన్ని బయటపెట్టిన ఏపీ అధికారులు 

ముంబై ప్రాంతానికి చెందిన నటి కాదంబరి జిత్వాని వ్యవహారంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ నేతలు పోలీసుల సహాయంతో కాదంబరి జిత్వానీ ని చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో అధికారులు ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించడం పై దృష్టి సారించారు..

Written By: Anabothula Bhaskar, Updated On : August 30, 2024 10:05 pm

Kadambari Jitwani

Follow us on

Kadambari Jitwani  : కాదంబరి వ్యవహారాల్లో ఇంటలిజెన్స్ మాజీ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే తాము అలాంటి పనులు చేశామని కింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఆంజనేయులు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కొంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నతాధికారులకు ఈ వ్యవహారంపై సమాచారం అందించారు. ఆ సమాచారం ఆధారంగానే పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిబంధనల ప్రకారం స్టేట్మెంట్ ఇవ్వాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమంగా నిర్బంధించడం, ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే విజయవాడకు తరలించడం, మహిళా పోలీసులు లేకుండా ఇద్దరు మహిళలను ఇక్కడిదాకా తీసుకురావడం.. వంటి విషయాలపై పోలీసులను అధికారులు సీరియస్ గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.. ఈ వ్యవహారంలో తెరవెనుక ముఖ్యపాత్ర పోషించింది ఎవరు? అనే అంశాలపై ఉన్నతాధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. విచారణలో భాగంగా పలు కీలక విషయాలను రాబడుతున్నారు. ఈ వ్యవహారంలో పాల్గొన్న సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు పిలిపించుకొని మాట్లాడారు. వారు ఎటువంటి సమాచారం రాబట్టారనేది తెలియకుండా ఉంది.
ఐపీఎస్ వర్గాల్లో చర్చనీయాంశం
 ఈ వ్యవహారం ఏపీలోని ఐపీఎస్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది..”సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసు అధికారులు ఇలాంటి పనిచేయడం సరికాదని” సీనియర్ ఐపీఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి చట్ట విరుద్ధమైన పని చేసిన వారు దర్జాగా ఉన్నారని.. చేసినవారే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.. ఇలాంటి పనుల వల్ల పోలీస్ శాఖకు మాయని మచ్చ ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..” ఘటన ఎలాంటిదైనా.. పోలీస్ శాఖ పరువు మాత్రం పోయింది. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు రాజకీయ పార్టీ నాయకులకు ఏజెంట్ లుగా మారిపోవడం బాధను కలిగిస్తోంది. ఆ సంఘటన తలుచుకుంటేనే ఇబ్బందికరంగా ఉందని” సీనియర్ ఐపీఎస్ అధికారులు అంతరంగిక చర్చల్లో వాపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తదుపరి అడుగులు ఏమిటి 
ఈ కేసు రోజురోజుకు సంచలనంగా మారుతున్న నేపథ్యంలో ఏపీ పోలీసులు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడటంతో ఈ కేసు మరింత జటిలంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో త్వరలోనే సంచలన విషయాలు మరిన్ని వెలుగు చూస్తాయని తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని తప్పుదారి పట్టించేందుకు జగన్ మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ముంబై నటిపై లేనిపోని ఆరోపణలతో అడ్డగోలు కథనాలను ప్రసారం చేస్తోందని మండిపడుతున్నారు. ఇలాంటి వ్యవహార శైలి సమాజానికి మంచిది కాదని హితవు పలుకుతున్నారు.