Konaseema: బాలిక కీర్తన.. నీ ధైర్యానికి సలాం అమ్మా

రావులపాలెం చెందిన సుహాసిని అనే మహిళ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఉలవ సురేష్ తో సహజీవనం చేస్తోంది. వీరికి 13 ఏళ్ల లక్ష్మీ కీర్తన, ఏడాది వయసున్న జెర్సీ అనే కుమార్తెలు ఉన్నారు.

Written By: Dharma, Updated On : August 7, 2023 10:35 am

Konaseema

Follow us on

Konaseema: ఆ చిన్నారి తెగువకు, సమయస్ఫూర్తికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఓ పక్క ప్రాణాలు పోతాయి అన్న భయం.. మరోవైపు తల్లి,చెల్లి గోదావరిలో కొట్టుకుపోయారన్న బాధ. చిమ్మ చీకటిలో వంతెన పై వేలాడుతూ తాను బతుకుతాను లేదో అన్న ఆవేదన. ఈ సమయంలో ఎవరైనా బతుకు పై ఆశలు వదులుకుంటారు. కానీ ఆ బాలిక సమయస్ఫూర్తితో ఆలోచించి 100కు ఫోన్ చేసి ప్రాణాలు దక్కించుకుంది. రావులపాలెం లో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

రావులపాలెం చెందిన సుహాసిని అనే మహిళ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఉలవ సురేష్ తో సహజీవనం చేస్తోంది. వీరికి 13 ఏళ్ల లక్ష్మీ కీర్తన, ఏడాది వయసున్న జెర్సీ అనే కుమార్తెలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా కుటుంబంలో వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో.. రావులపాలెం గౌతమి పాత వంతెన వద్దకు సురేష్ భార్య, పిల్లలను తీసుకెళ్లాడు. ముగ్గురిని వంతెన పైనుంచి గోదావరి నదిలోకి తోసేశాడు. సుహాసిని, జెర్సీలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. లక్ష్మీ కీర్తన మాత్రం బ్రిడ్జి గోడకు అడుగున ఉన్న పైపును పట్టుకొని ప్రాణాలను నిలబెట్టుకుంది. అయితే ముగ్గురు కొట్టుకుపోయారని భావించిన సురేష్ అక్కడి నుంచి జారుకున్నాడు.

చుట్టూ చిమ్మ చీకటి, పరవళ్ళు తొక్కుతూ వెళుతున్న గోదావరిని చూసి ఆ బాలిక ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపింది. వైపునకు వేలాడుతూనే ప్రాణాలు దక్కించుకోవడానికి ఉన్న మార్గాలను అన్వేషించింది. తన జేబులో ఉన్న ఫోన్ దొరకడంతో మెరుపులాంటి ఆలోచన చేసింది. 100 కు డయల్ చేసింది. తానున్న పరిస్థితిని తెలియజేసింది. వెంటనే స్పందించిన ఎస్ఐ వెంకటరమణ నేషనల్ హైవే సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పాపకు ధైర్యం చెబుతూ కాపాడారు. అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ. ధైర్యాన్ని కూడా తీసుకొని ప్రాణాలు కాపాడుకున్న బాలికను పలువురు అభినందించారు. కుటుంబంపై కర్కశానికి దిగిన సురేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.