Palnadu District
Palnadu District: తన సరసాలకు అడ్డంగా ఉన్నాడనో.. లేకుంటే ఆ చిన్నారి తండ్రి పై కోపమో తెలియదు గానీ.. ఐదేళ్ల బాలుడ్ని తల్లి చిత్ర హింసలు పెడుతోంది. నరకాన్ని చూపిస్తోంది. చేతులు వెనక్కి విరిచి.. తలను నీళ్ల బకెట్లో ముంచి.. శరీరాన్ని రంపంతో కోసి.. కాళ్లు, చేతులపై వాతలు పెట్టి నిత్యం చిత్రహింసలు పెడుతోంది. నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఎవరైనా ఒక్క మాట అంటేనే తట్టుకోలేం. అటువంటిది కన్నతల్లి చిత్రహింసలు పెడితే.. దానిని ఏమనాలి? ఏమని వర్ణించాలి? పల్నాడు జిల్లా మాచర్లలో వెలుగు చూసింది ఈ విషాద ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
పల్నాడు జిల్లా మాచర్ల కు చెందిన వ్యక్తికి.. పాతూరు కు చెందిన యువతి తో 2015లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త నేవీలో ఉద్యోగం చేస్తున్నాడు. గతంలో ముంబై, కాకినాడ, గుజరాత్ లో పని చేసేవాడు. ప్రస్తుతం ఒడిస్సాలో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో వారు ఏ రాష్ట్రంలో ఉంటే ఉంటే అక్కడకు అతడు వచ్చేవాడు. దీంతో దంపతులిద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ తరుణంలో ఆమె గత ఏడాదిగా స్వగ్రామంలోనే ఉంటోంది.
అయితే ఇటీవల ప్రియుడితో ఆమెకు విభేదాలు వచ్చాయి. తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేని ప్రియుడు ఆమె తన ఐదేళ్ల చిన్నారికి పెట్టిన చిత్రహింసలను వీడియోలను తీసి.. ఆమె భర్తకు పంపించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆ భర్త వచ్చి కుమారుడ్ని తీసుకెళ్లిపోయాడు. భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించాడు. ప్రియుడు మోజులో పడి భర్తను నిర్లక్ష్యం చేయడంతో పాటు కుమారుడ్ని చిత్రహింసలకు గురిచేసిన ఆ మహిళ తీరు సభ్య సమాజంలో తలదించుకునేలా మారింది. ఆమె తీరును అందరూ అసహ్యించుకుంటున్నారు.