Mega 156: చిరంజీవి కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది మెగా 156. దసరా పండగను పురస్కరించుకుని మంగళవారం గ్రాండ్ గా లాంచ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన పూజా కార్యక్రమానికి దర్శకుడు వశిష్ట్ తో పాటు నిర్మాతలు, చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి సతీసమేతంగా పాల్గొన్నారు. బింబిసార చిత్రంతో చిత్ర పరిశ్రమను ఆకర్షించిన వశిష్ట్ చెప్పిన కథకు ఫిదా అయిన చిరంజీవి ప్రాజెక్ట్ ఓకే చేశాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కుతుంది.
కాన్సెప్ట్ పోస్టర్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. పంచ భూతాలైన నింగి, నేల, నీరు, ఆకాశం, నిప్పుతో కూడిన లోగో అద్బుతంగా ఉంది. ఇది సోషియో ఫాంటసీ చిత్రం అని ఇప్పటికే సమాచారం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ కి భారీగా ఖర్చు చేయనున్నారట. మెగా 156 బడ్జెట్ రూ. 200 కోట్లని సమాచారం. కాగా ఈ చిత్ర కథ అండ్ టైటిల్ లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
మెగా 156 చిత్ర టైటిల్ గా విశ్వంభర నిర్ణయించారట. ట్విస్ట్ ఏంటంటే ఈ టైటిల్ మొదట చరణ్-శంకర్ చిత్రానికి అనుకున్నారు. అయితే పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమాకు ఇలాంటి క్లాసిక్ గా టైటిల్ కాకుండా క్యాచీ అండ్ ట్రెండీ టైటిల్ కావాలని గేమ్ ఛేంజర్ కి మారారు. అదే టైటిల్ ని ఇప్పుడు మెగా 156కి వాడుతున్నారట. కథకు ఈ టైటిల్ బాగా ఆప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. అలాగే సినిమా కథపై కూడా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇది మూడు లోకాలలో సాగే కథ అట. జగదేకవీరుడిగా చిరంజీవి పాత్ర ఉంటుందట. మూడు లోకాల్లో ముగ్గురు హీరోయిన్స్ తో చిరంజీవి రొమాన్స్ చేస్తాడని సమాచారం. అందుకు టాప్ హీరోయిన్స్ పేర్లు పరిశీలిస్తున్నారట. చిరంజీవి పాత్రకు కూడా సూపర్ నాచురల్ ఉండే అవకాశం కలదట. ఇక ప్రధాన విలన్ గా రానా నటిస్తున్నారనేది మరో వాదన. మొత్తంగా చిరంజీవి కెరీర్లో ఇది స్పెషల్ మూవీ కానుంది.