Former minister Daissetty Raja : ఆ మాజీ మంత్రి చుట్టూ ఉచ్చు.. వెంటాడుతున్న విలేఖరి హత్య కేసు

అధికారానికి దూరమైన తర్వాత వైసీపీ నేతలపై కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పై నమోదైన విలేకరి హత్య కేసు ఒకటి బిగుసుకుంటోంది.

Written By: Dharma, Updated On : October 30, 2024 1:28 pm

Former minister Daissetty Raja

Follow us on

Former minister Daissetty Raja : ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గత ఐదేళ్లలో కొంతమంది వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అప్పట్లో అధికారం చేతిలో ఉండడంతో తప్పించుకున్నారు. కేసులు కఠినంగా ఉండకుండా చూసుకున్నారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. దూకుడు కలిగిన వైసీపీ నేతలపై దృష్టి పెట్టింది. పాత కేసులను తిరగదోడుతోంది. ఈ తరుణంలోనే మాజీమంత్రి దాడిశెట్టి రాజా పై నమోదైన హత్య కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆయనపై ఇప్పుడు కత్తి వేలాడుతోంది. దీంతో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు దాడిశెట్టి రాజా. కానీ కోర్టు మాత్రం తీర్పును నవంబర్ 5కు వాయిదా వేసింది. దీంతో రాజాలు ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది.

* ఐదేళ్ల కిందట హత్య
తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరిగా సత్యనారాయణ అనే వ్యక్తి పని చేసేవాడు. 2019 అక్టోబర్ 15న ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్ అన్నవరంలోని తన ఇంటికి వెళ్తుండగా చెరువు గట్టుపై అడ్డుకొని కొందరు కత్తులతో దాడి చేశారు. దీంతో సత్యనారాయణ మృతి చెందాడు. అయితే ఈ హత్యకు దాడిశెట్టి రాజా సూత్రధారి అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో తుని గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అయితే దాడిశెట్టి రాజా మంత్రి అయ్యాక ఈ కేసు ముందుకు సాగలేదు. 2023లో అయితే ఏకంగా ఆయన పేరును ఛార్జ్ షీట్ నుంచి తొలగించారు. సత్యనారాయణ సోదరుడు గోపాలకృష్ణ న్యాయవాది కావడంతో రాజాపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఎన్ హెచ్ ఆర్ సి తో పాటు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం దాడిశెట్టి రాజా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం నవంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది.

* జోరుగా ప్రచారం
మరోవైపు దాడిశెట్టి రాజా జనసేన లోకి వెళ్తారని జోరుగా ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో సైతం విస్తృత ప్రచారం జరిగింది. త్వరలో ఆయన రాజీనామా చేస్తారని కూడా టాక్ నడిచింది. అయితే దీనిపై పెద్ద దుమారం నడిపించింది. తనపై జరుగుతున్న ప్రచారంపై దాడిశెట్టి రాజా స్పందించారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని.. అదంతా దుష్ప్రచారం మాత్రమేనని తేల్చి చెప్పారు. అయితే అది మరువక ముందే ఇప్పుడు విలేకరి హత్య కేసు వెంటాడుతుండడం విశేషం. నవంబర్ ఐదు న ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఎటువంటి తీర్పు వస్తుందోనన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది.