Deputy CM Pavan Kalyan : సనాతన ధర్మంపై పవన్ గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై తమిళనాడులో కేసు నమోదు అయ్యింది. టీటీడీ లడ్డు వివాదం నేపథ్యంలో పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజులపాటు చేపట్టారు. చివరి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారాహి డిక్లరేషన్ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పలు విషయాలను వెల్లడించారు. గతంలో సనాతన ధర్మంపై చాలామంది వ్యాఖ్యానాలు చేశారని.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణం త్యాగం చేసేందుకు వెనుకాడమని పవన్ స్పష్టం చేశారు. అయితే గతంలో సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం చాలా ప్రమాదమని.. దీనిని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పుకొచ్చారు. అయితే పవన్ తాజాగా తిరుపతి సభలో దానికి కౌంటర్ ఇచ్చారు. నాడు ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇతర మతాలపై ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటే దేశం పగలబడిపోయి ఉండేదని పవన్ అన్నారు. హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. దేవుడు ఆశీస్సులు తీసుకుని చెబుతున్నానని.. సనాతన ధర్మాన్ని ఎవరు ఏమి చేయలేరన్న సంగతి గుర్తుంచుకోవాలని పవన్ చెప్పారు. అటువంటివారు వస్తారు.. పోతారు అని.. కానీ సనాతన ధర్మం అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పారు పవన్. అయితే ఎక్కడ ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించలేదు. కానీ ఉదయనిధి స్టాలిన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మధురైలో ఓ కేసు నమోదు కావడం విశేషం. వంజి నాధన్ అనే న్యాయవాది మధురై కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తిరుపతి లడ్డు వివాదంలో ఉదయ నిధికి ఏమాత్రం సంబంధం లేదని.. అయినా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు.
* వెయిట్ అండ్ సి అంటున్న ఉదయనిధి
ఉదయనిధి స్టాలిన్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ విమర్శలు చేసిన నేపథ్యంలో తమిళనాడులో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా డీఎంకే శ్రేణులు పవన్ తీరును తప్పుపడుతున్నాయి. ఎప్పుడో జరిగిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తేవడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. పవన్ కామెంట్స్ పై ఉదయనిధి స్టాలిన్ వద్ద ప్రస్తావించగా.. ఆయన వెయిట్ అండ్ సీ అంటూ కౌంటర్ ఇచ్చారు. కొద్ది నెలల కిందట ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం వైరస్ లాంటిదని.. దానిని అరికట్టాలి అంటూ చేసిన కామెంట్స్ జాతీయస్థాయిలో దుమారం రేపాయి.
* ఎన్నికల వ్యూహమా
అయితే పవన్ ఇప్పుడు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై పడటం సరికొత్త అనుమానాలకు తెరతీస్తోంది. 2025లో తమిళనాడుకు ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేసేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. మరోవైపు విజయ్ దళపతి కొత్త పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ బలపడడం ఎలా అని బిజెపి ఆలోచన చేస్తోంది. అందుకే పవన్ ద్వారా హిందుత్వ వాదాన్ని తెరపైకి తెచ్చినట్లు అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి అయితే పవన్ పై తమిళనాడులో కేసు నమోదు కావడం సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.