Annamayya District: బాబోయ్ ఈ దొంగలు మామూలోళ్ళు కాదు.. ఏకంగా ఒంటెనే తస్కరించారు..

ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం.. అక్కడ అంగళ్లు అనే ప్రాంతం చాలా ఫేమస్. ఆ ప్రాంతంలో వివిధ రకాల వస్తువులు అమ్ముతుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 12, 2024 6:40 pm

Annamayya District

Follow us on

Annamayya District: బంగారం దొంగతనం గురించి విని ఉంటాం, డబ్బు దొంగతనం గురించి పేపర్లో చదివి ఉంటాం, విలువైన వస్తువుల దొంగతనం వంటి వార్తను వినే ఉంటాం, ఖరీదైన దస్త్రాల దొంగతనం కూడా తెలుసుకునే ఉంటాం. కానీ ఈ దొంగతనం మాత్రం చాలా విచిత్రం. ఇంతవరకు చరిత్రలో జరిగిందో లేదో కూడా తెలియదు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..

అది ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం.. అక్కడ అంగళ్లు అనే ప్రాంతం చాలా ఫేమస్. ఆ ప్రాంతంలో వివిధ రకాల వస్తువులు అమ్ముతుంటారు. ఒక రకంగా అది ఆ మండలానికి వాణిజ్య ప్రాంతం లాంటిది. అక్కడ పెద్ద జంతువులలో ఒకటైన ఒంటె ను చోరీ చేశారు.. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

అక్కడి స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ముస్లింలు జరుపుకునే అతిపెద్ద పండుగలో ఒకటి బక్రీద్. త్వరలో ఈ పండుగ రానుంది. దీనికి సంబంధించి వేడుకను ఘనంగా జరుపుకునేందుకు అంగళ్ళ ప్రాంతానికి చెందిన కొంతమంది మిత్రులు ఇటీవల 1.25 ఐదు లక్షలు ఖర్చుపెట్టి ఒంటె కొనుగోలు చేశారు. దానిని పరిసర ప్రాంతాల్లో మేపుతున్నారు. రాత్రి సమయంలో ఇంటి ఎదుట కట్టేసేవారు. అయితే ఇటీవల వేకువ జామున చూస్తే ఆ ఒంటె కనిపించలేదు. దానిని కట్టి వేసిన తాడు కూడా అదృశ్యమైంది.

తొలుత ఆ ఒంటె తాడు తెంపుకొని వెళ్లిందని ఆ మిత్రులు భావించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ దాని ఆచూకీ లభించలేదు.. సాయంత్రం వరకు దాని జాడ కోసం కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగారు. అయినప్పటికీ అది కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా జల్లెడ పట్టారు. ఇతర గ్రామాల్లో కూడా వెళ్లారు. పొలాలు, చేను, చెలకలు మొత్తం చుట్టివచ్చారు. ఒంటె జడ మాత్రం కనిపించలేదు.. ఎవరైనా వ్యక్తులు తోలుకెళ్ళి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

అయితే కనసానివారిపల్లె నుంచి మదనపల్లెకు నిర్మిస్తున్న బైపాస్ రోడ్డు మీదుగా ఒంటెను తీసుకెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఒంటె లాంటి జంతువులు తస్కరించాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ అలాంటి పెద్ద జంతువును కూడా వారు దొంగిలించారు అంటే ఎంతటి చోర శికామణులో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒంటె ఆచూకీ చెబితే తగిన పారితోషికం ఇస్తామని బాధితులు చెబుతున్నారు.