Ahmed Shehzad: జట్టులో అంతా నీ వాళ్లను నింపావు.. అందుకే ఈ ఓటములు.. బాబర్ పై సంచలన విమర్శలు

పాకిస్తాన్ జట్టు ఒకప్పుడు బలంగా ఉండేదని, ఇప్పుడు కిందిస్థాయి జట్ల చేతిలో ఓడిపోవడానికి కెప్టెన్ నిర్వాకమే కారణమని షెహజాద్ వ్యాఖ్యానించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 12, 2024 6:31 pm

Ahmed Shehzad

Follow us on

Ahmed Shehzad: టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగుతోంది. అనామకమైన అమెరికా జట్టు చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్.. భారత్ పై స్వల్ప స్కోరు ను చేదించలేక ఓటమిపాలైంది. కెనడా తో జరిగిన మ్యాచ్లో గెలుపొంది సూపర్ -8 రేసులో కొనసాగుతోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ అజాం పై ఆ జట్టు మాజీ ఆటగాడు షెహజాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ గా మారాయి.

పాకిస్తాన్ జట్టు ఒకప్పుడు బలంగా ఉండేదని, ఇప్పుడు కిందిస్థాయి జట్ల చేతిలో ఓడిపోవడానికి కెప్టెన్ నిర్వాకమే కారణమని షెహజాద్ వ్యాఖ్యానించాడు. అతడు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పాకిస్తాన్ జట్టు మొత్తం నాశనమవుతోందని, పెద్ద మ్యాచ్లలో సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడ లేకపోతున్నాడని షెహజాద్ మండిపడ్డాడు..”అతడికి కెప్టెన్సీ వచ్చిన నాటి నుంచి సాధారణ జట్లపై కూడా పాకిస్తాన్ ఓడిపోతోంది.. కానీ, ఇలాంటి ఆట తీరు మార్చుకునేందుకు అతను ముందడుగు వేయడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే బాధగా ఉంది. కానీ తప్పడం లేదని” షెహజాద్ పేర్కొన్నాడు.

నాలుగైదు సంవత్సరాలుగా జట్టును కాపాడుతున్నామని కొందరు భావిస్తున్నారని, కానీ వాస్తవ పరిస్థితి అలా కనిపించడం లేదని షెహజాద్ అభిప్రాయపడ్డాడు. 120 పరుగుల లక్ష్యాన్ని కూడా చేదించేందుకు క్రీజ్ లో ఉండలేని ఆటగాళ్లను ఏమని పిలవాలని అతడు ప్రశ్నించాడు. “భారత్ లాంటి పెద్ద జట్టుపై విజయం సాధించలేమని ముందే ఒక అంచనాకు వచ్చారా? ఇప్పుడున్న వాళ్లంతా బీ, సీ, డీ లాంటి జట్లపై మాత్రమే ఆడుతున్నారు. అభిమానులను మోసం చేస్తున్నారు. చివరికి ఐర్లాండ్ జట్టుపై కూడా ఓడిపోతున్నారు. మీ జీతాలు పెంచారు కదా.. అలాంటప్పుడు వ్యక్తిగతంగా మీ ఆటను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం లేదా? ఈ దిశగా మీరు ఎందుకు ఆలోచించడం లేదు? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగానే మీకు చెల్లిస్తోంది కదా?” అని షెహజాద్ విమర్శించాడు.

కెప్టెన్ బాబర్ అజాం గణంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తోందని షెహజాద్ అన్నాడు. అతడి సగటు కేవలం 27, స్ట్రైక్ రేట్ 122 మాత్రమే. మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినప్పటికీ జట్టును గెలిపించడంలో వెనుకబడిపోతున్నాడని
షెహజాద్ అన్నాడు..” ఈ గణాంకాలను చూస్తే మీకు ఏమనిపిస్తోంది..మ్యాచ్ లను గెలిపించ లేనప్పుడు కింగ్ అని ఎలా అంటారు? అలాంటివాడు కింగ్ ఎలా అవుతాడు? అతడు తీసుకుంటున్న నిర్ణయాలు మోసపూరితంగా ఉంటున్నాయి. జట్టును మొత్తం తన ఆధీనంలోకి తీసుకుంటున్నాడు. స్నేహితులతో నింపేస్తున్నాడని” షెహజాద్ బాబర్ అజాంపై మండిపడ్డాడు.