Arakuloya : ప్రభుత్వాలు మారుతున్నా గిరిజనుల తలరాతలు మారడం లేదు. వారికి విద్య, వైద్యం మెరుగుపడటం లేదు. అవి ప్రభుత్వాల లెక్కలకు, పేపర్లకు పరిమితమవుతున్నాయి. వారిలో అవగాహన లోపం శాపంగా మారుతోంది. వ్యవస్థల్లో వైఫల్యాలతో గిరిజనులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. తాజాగా అటువంటి ఘటనే ఉమ్మడి విశాఖలో వెలుగు చూసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తమ కుమారుడ్ని రక్షించుకుందామని ఓ గిరిజన కుటుంబం పడిన బాధ అంతా ఇంతా కాదు. వందల కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చివరి ఘడియల్లో బిడ్డను కన్న ఊరిలో ఉంచడానికి తల్లిదండ్రులు ప్రయత్నించారు. బిడ్డను తీసుకుని ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే ఆ బాలుడు మార్గమధ్యంలో చనిపోయాడు. కుమారుడు మృతదేహంతో బస్సు దిగిన వారు రోడ్డు పక్కనే దీనంగా కూర్చొని విలపించారు. తల్లిదండ్రుల పరిస్థితిని గమనించిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం చీముల బంధ గ్రామానికి చెందిన కుర్రా సుబ్బారావు కుమారుడు కార్తీక్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఇటీవల చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీ హెచ్ కు తరలించాలని సూచించారు. దీంతో ఈ నెల మూడున విశాఖ కేజీహెచ్ లో కార్తీక్ ను చేర్పించారు. అయితేమూడు నెలల కిందట కుక్క కరవడంతో అనారోగ్యానికి గురయ్యాడని గుర్తించారు. వ్యాక్సిన్ వెయ్యకపోవడంతోనే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు తేల్చారు. అయితే అక్కడ చికిత్స పొందుతుండగా బాలుడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుమారుడిని సొంత గ్రామానికి తీసుకెళ్లాలని ఆ తల్లిదండ్రులు భావించారు.
* అంతిమ ఘడియల కోసం
అంతిమ ఘడియలు ఇంటివద్ద గడిపేలా
చూడాలని వైద్యులను కోరడంతో వారు అంగీకరించారు. దీంతో ఆదివారం విశాఖలో అరకులోయ బస్సు ఎక్కారు. కానీ స్వగ్రామం రాక మునుపే అరకులోయ వద్ద బాలుడు మృతి చెందాడు. ఏం చేయాలో తెలియక ఆ బాలుడిని పట్టుకుని దంపతులు కిందకు దిగిపోయారు. మృతదేహంతో ఆర్టీసీ కాంప్లెక్స్ కి వెళ్లి మార్గంలో రోడ్డు పక్కన విలపిస్తూ కూర్చున్నారు. వీరి దయనీయ పరిస్థితిని గమనించిన స్థానికులు ఆర్థిక సాయం చేశారు. అరకు ఎంపీ తనుజారాణి అంబులెన్స్ ఏర్పాటు చేయడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ హృదయ విదారక ఘటన చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు.
* మూడు నెలల కిందట కుక్క కాటు
వాస్తవానికి ఆ బాలుడికి మూడు నెలల కిందటే కుక్క కరిచింది. ర్యాబిస్ వ్యాక్సిన్ వేయాలని అవగాహన లేకపోవడంతో నిర్లక్ష్యంగా వదిలేశారు తల్లిదండ్రులు. దీంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలపై గిరిజనుల్లో ఇంకా అవగాహన పెరగలేదనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుంది. మన్యం వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య సేవలు అంతంతమాత్రంగా తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* వైద్య ఆరోగ్యశాఖలో వైఫల్యాలు
వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నో రకాల వైఫల్యాలు కనిపిస్తున్నా ప్రభుత్వాల్లో చలనం రావడం లేదు. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఘటనలే వెలుగు చూసాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా.. అదే పరిస్థితి కొనసాగుతోంది. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో వసతులు మెరుగుపడేలా చూడాల్సిన అవసరం ఉంది. వైద్యం అందక మనుషులు ప్రాణాలు కోల్పోతున్న వైనంపై దృష్టి పెట్టాల్సిన అవసరం అనివార్యం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More